శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 08, 2020 , 02:19:04

ప్రజలకు అవసరమైన మొక్కలు పెంచాలి

ప్రజలకు అవసరమైన మొక్కలు పెంచాలి

తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ/ మానకొండూర్‌ రూరల్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల్లో గ్రామాల ప్రజల అవసరానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని కలెక్టర్‌ కే శశాంక అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్‌ మండలంలోని మహాత్మానగర్‌, గొల్లపల్లి, మానకొండూర్‌ మండలం పచ్చునూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మహాత్మానగర్‌లో నర్సరీని పరిశీలించి మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని నర్సరీలకు గేటు, బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లకు రెండువైపులా వేప, రావి, మర్రి, ఉసిరి, చింత లాంటి మొక్కలను నాటాలన్నారు. అన్ని నర్సరీల్లో స్టాక్‌ రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలని, మొక్కల వివరాలతో పాటు, పంపిణీ చేసిన వాటి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఓ వెంకటేశ్వర్‌రావు, ఏపీడీ మంజులాదేవి, తిమ్మాపూర్‌ ఎంపీపీ కేతిరెడ్డి వనిత, కేడీసీసీబీ డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఎంపీడీఓ చింతల రవీందర్‌రెడ్డి, తాసిల్దార్‌ బండి రాజేశ్వరి, ఏపీఓ విజయ, సర్పంచ్‌లు జక్కని శ్రీవాణి, మల్లెత్తుల అంజయ్య, ఉప సర్పంచ్‌ మడుపు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దుండ్ర రాజయ్య యాదవ్‌, వార్డు సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


logo