‘సాపాటు ఎటూ లేదు…’ అని రాజధాని నగరంలో వీధి వీధి తిరుగుతూ ‘ఆకలి రాజ్యం’లో హీరోగారు అందుకున్న పాట గుర్తుందిగా! సినిమా కథపరంగా అలా పాడుకున్నాడేమో కానీ, ఢిల్లీలో గల్లీగల్లీ ఘుమఘుమలతో స్వాగతిస్తుంది. ఓ వీధిలో మొఘల్ పాకాలు చవులూరిస్తే.. మరో సందులో రాజ్‌పుత్ రాచరికపు రుచులు కుళ్లబొడిచెయ్ అని రెచ్చగొడతాయి. చాంద్నీ చౌక్‌లో పరాఠాలు మరాఠా యోధుల్లా ఎదురవుతాయి. లజపత్నగర్లో పంజాబీ పకోడీలు భల్లే భల్లే అనిపిస్తాయి. ఎందుకు ఆలస్యం రుచుల రాయబారం సలపడానికి హస్తినకు పోయివద్దాం…
Delhi | హస్తినలో పీఠం కోసం యావత్ భారతం వాడివేడిగా ఉంటే.. భోజనప్రియులకు అక్కడ ఆస్వాదించడానికి వేడివేడిగా కావాల్సింది దొరుకుతుంది. ఇండియా గేట్ దగ్గర భేల్‌పూరీ భలేగా ఉంటుంది. దాన్ని అలా టేస్ట్ చేసి.. వెనక్కి తిరిగే సరికి బెంగాలీ జంట రుచి చూస్తున్న పానీపూరీ కంటపడుతుంది. అటుగా వెళ్లి.. గోల్గప్పాలను అమాంతం మింగకుండా ఎవరు మాత్రం ఉండగలరు. ఇవి అంతటా దొరికేవే.. ఈ మాత్రానికి ఢిల్లీ దాకా వెళ్లాలా? అని క్వశ్చనింగ్ ఫేస్ పెట్టేయకండి. అసలు విహారం ముందుంది… తినబోతూ రుచులెందుకు??
ఇండియా గేట్ నుంచి చావడీ బజార్‌కు ఆరున్నర కిలోమీటర్ల దూరం. ఓపిక ఉంటే.. కాలినడకన వెళ్లి కడుపు కాస్త మాడ్చుకోండి. ఉదర బాధను చెదరగొట్టడానికి ఇక్కడ కావాల్సినన్ని చిరుతిళ్లు దొరుకుతాయి. ఆదరాబాదరాగా కనిపించిందల్లా తినేయొద్దు. కాస్త ఆరాలు తీస్తే శ్యామ్ స్వీట్స్ బోర్డు కనిపిస్తుంది. దొరక్కపోతే… నాగోరీ హల్వా దొరికే మిఠాయి కొట్టు ఎక్కడంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు. సాబుదాన, మైదా కలగలిపి చేసిన హల్వా ఇక్కడి స్పెషల్. ఇందులోకి పూరీలు ఇవ్వడం మరీ ప్రత్యేకం. చిట్టిచిట్టి పూరీల్లోకి తియ్యటి హల్వా చేర్చి జిహ్వకు అందించగానే… ఇందాకటి బడలిక అంతా పరారైపోతుంది. తీపితో మొదలయ్యే చావడీ బజార్ పర్యటన హాటుతో ఘాటుగా మారాలంటే అక్కడే కచోరీ తినాలి. మినప్పిండితో చేసే బేడ్మీ కచోరీని రుచి చూశాక.. టెంప్ట్ అయిపోయి చోరీ చేసైనా మరో కచోరీ తిందామనిపిస్తుంది. ఆ నాల్కను కాస్త మడతపెట్టి నాలుగు అడుగులు వేస్తే సౌ సాల్ పురానా కురేమల్ కుల్ఫీ కొట్టు దారికాచి రుచి చూడమంటుంది. రకరకాల పండ్ల ఫ్లేవర్లలో దొరికే కుల్ఫీలు ఇక్కడ ఫేమస్. ఒకటి తిన్నాక రెండోది కావాలని అడగక మానరు. మళ్లీ తీపి తగిలిన టంగ్ ఆనందంతో స్లిప్పయ్యే ప్రమాదం లేకుండా.. సమీపాన ఉన్న అశోక్ చాట్ బండారుకేగి… సమోసా రగడా తింటే గానీ జఠరాగ్నితో జగడం పూర్తవ్వదు.
చావడీ బజార్ నుంచి చంద్రుడు దగ్గరా, చాందినీ చౌక్ దగ్గరా అంటే.. కనిపిస్తాడు కాబట్టి చంద్రుడే దగ్గర అంటేనే కిక్కు. చంద్రుడి మీద ప్రయోగాల మాటేమిటో గానీ… చాందినీ చౌక్‌లో పాక ప్రయోగాలు జాస్తిగా జరుగుతాయి. ఇక్కడి మొఘల్ రాజుల కోసం ఏర్పాటైన అంగడి ఇప్పుడు అందరిది! ఈ మార్కెట్లో చెప్పుల నుంచి టోపీ దాకా చౌకగా దొరుకుతాయి. ఆ సంగతి అటుంచితే.. ఢిల్లీ దర్పాన్ని తెలిపే పరాఠేవాలీ గల్లీ ఉన్నది ఇక్కడే. తాజ్‌మహల్ కట్టించిన షాజహానే దీని నిర్మాత కూడా! ఈ గల్లీలో పొరలు పొరలుగా చేసే పరాఠాలు భోజనప్రియులకు పసందైన విందు అందిస్తాయి. అసలు విషయం ఆ పరాఠాల్లో కన్నా.. వాటిల్లోకి నంజుకోవడానికి చేసిన కర్రీల్లోనే ఉంటుంది. ఆలుగడ్డ కుర్మా, గుమ్మడికాయ కూర, చింతపండు అంటుపులుసు.. ఇలా వెరైటీ శాకాలు శాఖోపశాఖలుగా విస్తరించిన పరాఠేవాలీ గల్లీలో తిరిగినంత సేపూ ముక్కుపుటాలకు కొత్త వాసనలు పరిచయం అవుతూనే ఉంటాయి. పరాఠా తిన్నాక పొట్టలో కూసంత చోటుంటే.. చైనా రామ్ స్వీట్స్‌లో ఓ సమోసా తినేస్తే ఓ పనైపోతుంది బాబు!
ఇక్కడితో చాందినీ చౌక్ పర్యటన పూర్తవ్వదు. దీనికి అనుబంధంగా బల్లీమారాన్ ప్రాంతం ఉంటుంది. మొఘల్ ఆస్థాన విద్వాంసుడు మీర్జా గాలిబ్ హవేలీ ఉన్నది ఇక్కడే! బల్లీమారాన్ గల్లీలో దొరికే కబాబ్స్ గాలిబ్ గజల్స్ కన్నా పసందుగా ఉంటాయి. నిప్పుల కుంపటిపై గింగిరాలు తిరుగుతూ, మధ్యమధ్యలో మసాలాలు పులుముకుంటూ సెగలు కక్కే చికెన్ కబాబ్ చేతికి దొరికిందే ఆలస్యం నోటికి అందాల్సిందే! ఇలా చెబుతూ పోతే.. హస్తినలో రుచుల పర్యటన కృష్ణరాయబారం కన్నా పెద్ద అంకమే అవుతుంది. ఈసారి అటుగా వెళ్లినప్పుడు ఇవన్నీ ఓ పట్టుపట్టండి. ఢిల్లీ దేశ రాజధాని మాత్రమే కాదు.. రుచుల రాజధాని కూడా అని కరెంట్ అఫైర్స్ రాసుకోకపోతే ఒట్టు!!