హిమాలయాల కంటే పురాతనం
`
1. కింది జతలను పరిశీలించండి?
చిత్తడి నేల – ప్రదేశం
1. యశ్వంత్ సాగర్ – మధ్యప్రదేశ్
2. తంపారా సరస్సు – తమిళనాడు
3. చిత్రంగుడి పక్షుల అభయారణ్యం – ఒడిశా
4. రోపార్ సరస్సు – పంజాబ్
పై జతల్లో ఎన్ని సరిగ్గా సరిపోలాయి?
ఎ) ఒక జత మాత్రమే
బి) రెండు జతలు మాత్రమే
సి) మూడు జతలు మాత్రమే
డి) నాలుగు జతలు
సమాధానం: (బి)
వివరణ:
సరైన జతలు…చిత్తడి నేల – ప్రదేశం
1. యశ్వంత్ సాగర్ – మధ్యప్రదేశ్
2. తంపారా సరస్సు – ఒడిశా
3. చిత్రంగుడి పక్షుల అభయారణ్యం – తమిళనాడు
4. రోపార్ సరస్సు – పంజాబ్
- సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉండే ప్రాంతాలను చిత్తడి ప్రాంతాలు అంటారు. ఉదా: మంచినీటి, ఉప్పునీటి సరస్సులు, మడ అడవులను కలిగిన సాగర సంగమ ప్రాంతాలు, బురద కయ్యలు, ఉప్పు నీటి కయ్యలు, రొయ్యల చెరువులు, వరి పొలాలు, ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు, నదీముఖ, సముద్ర తీర ప్రాంతాలు.
- చిత్తడి నేలల వల్ల ప్రయోజనాలు
- నదీ తీరాల్లోని చిత్తడి నేలలు… ప్రవాహ ఉధృతిని, అలల తాకిడిని అడ్డుకుని తుఫానులు, వరదల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
- అరుదైన మత్స్య, వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతో పాటు దేశ, విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.
- ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాకుండా, కాలుష్య తీవ్రతను తగ్గించడంలోనూ కీలక పాత్రను పోషిస్తున్నాయి.
- చిత్తడి నేలలు… సాగు, తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఆహార భద్రతకు భరోసాను కల్పిస్తున్నాయి.
- ఈ నేలల్లో లభించే చేపల్లో పోషకాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధనలు తేల్చాయి.
- చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్తడి నేలలు పర్యాటక ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం చిత్తడి నేలలపై ఆధారపడి ఉన్నారు.
- ఈ నేలలు అడవుల కంటే మూడు రెట్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. ఈ చిత్తడి నేలల పరిరక్షణకు 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని ‘రామ్సర్’లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందంపై 164 దేశాలు సంతకం చేశాయి. దాన్నే ‘రామ్సర్’ ఒప్పందం అంటారు. చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది.
- 1997 నుంచి ఏటా, తొలి అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ సదస్సు జరిగిన ఫిబ్రవరి 2వ తేదీని ‘ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ఈ ఏడాది థీమ్ ‘వెట్‌ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్’ (చిత్తడి నేలలు – మానవ శ్రేయస్సు).
- దేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన వేళ, దేశంలో 11 కొత్త చిత్తడి ప్రాంతాలను రామ్సర్ సైట్లుగా గుర్తించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశంలో గుర్తింపు పొందిన మొత్తం రామ్-సర్ సైట్ల జాబితా 75కు పెరిగింది.
- పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ 2024 జనవరిలో ఐదు కొత్త రామ్సర్ సైట్లను (అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు) ప్రకటించారు. ప్రస్తుతం భారతదేశంలో 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి.
- జనవరి 2024లో, భారతదేశంలోని రామ్సర్ సైట్ల జాబితాలో ఐదు కొత్త సైట్లను చేర్చారు.
1) అంకసముద్ర పక్షుల సంరక్షణ రిజర్వ్ కర్ణాటక
2) అఘనాశిని నదీతీరం – కర్ణాటక
3) మాగడి కేర్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక
4) కరైవెట్టి పక్షుల అభయారణ్యం – తమిళనాడు
5) లాంగ్ వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ – తమిళనాడు - భారతదేశం, జనవరి 2024 నాటికి 1.33 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 80 రామ్సర్ సైట్లను కలిగి ఉంది.
2. కింది ప్రకటనలను పరిశీలించండి?
1. ఢిల్లీ సుల్తానుల్లో మహమ్మద్-బిన్-తుగ్లక్ హిందువుల పండుగల్లో పాల్గొన్న మొదటి సుల్తాన్.
2. ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తానుల కాలంలో మొదటిసారి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను స్థాపించాడు.
3. అల్లావుద్దీన్ ఖిల్జీ ’ఘరీ టాక్స్’ (ఘరీ పన్ను) ’గ్రేజింగ్ ట్యాక్స్’ (మేత పన్ను) విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్.
పైన పేర్కొన్న ప్రకటనల్లో సరైనవి ఏవి?
ఎ) ఒకటి మాత్రమే బి) రెండు మాత్రమే
సి) మూడు డి) ఏదీ కాదు
సమాధానం: (సి)
వివరణ: ఢిల్లీ సుల్తానుల్లో ముహమ్మద్-బిన్-తుగ్లక్ హిందువుల పండుగల్లో (ముఖ్యంగా హోలీ) పాల్గొన్న మొదటి సుల్తాన్. కాబట్టి ప్రకటన-1 సరైనది.
- సుల్తానుల కాలంలో మొదటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించాడు. కాబట్టి ప్రకటన-2 సరైనది.
- రెండు కొత్త పన్నులను విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అవి… ఇళ్లకు, గుడిసెలకు ఘరీ పన్ను, పాలిచ్చే జంతువులకు మేత పన్ను విధించారు. కాబట్టి ప్రకటన-3 సరైనది.
3. కింది జతలను పరిశీలించండి.
1. చైనీస్ ఫాస్ట్ ఫుడ్- మోనోసోడియం గ్లుటామేట్
2. లిప్ స్టిక్ సీసం (లెడ్)
3. శీతల పానీయాలు – బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్
పైన పేర్కొన్న ఎన్ని జతలు సరిగ్గా సరిపోలాయి?
ఎ) ఒక జత
బి) రెండు జతలు
సి) మూడు జతలు
డి) ఏవీ సరిపోలి లేవు
సమాధానం: (బి)
వివరణ: చైనీస్ ఫాస్ట్ ఫుడ్, అనేక ఇతర వంటకాల్లో మోనోసోడియం గ్లుటామేట్ (MSG) అనేది సాధారణంగా ఉపయోగించే రుచిని పెంచే పదార్థం. అందువల్ల జత-1 సరిగ్గా సరిపోలింది.
- కాలక్రమేణా లిప్‌స్టిక్‌లలో సీసం వాడకం గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని లిప్‌స్టిక్‌ల్లో సీసం ఉన్నట్లు కనుగొన్నారు. అందువల్ల జత-2 సరిగ్గా సరిపోలింది.
- శీతలపానీయాల్లో సాధారణంగా బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ (BVO) ఉండవు. BVO కొన్నిసార్లు సిట్రస్ రుచి గల శీతలపానీయాల్లో ఉపయోగిస్తారు. కానీ భద్రతా కారణాల వల్ల దీని వినియోగం తగ్గుతూ వచ్చింది. అందువల్ల జత-3 సరిగ్గా సరిపోలలేదు. కాబట్టి, ఎంపిక (బి) సరైన సమాధానం.
4. పశ్చిమ కనుమలకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి?
1. ప్రపంచంలోని జీవ వైవిధ్యానికి సంబంధించిన ఎనిమిది హాట్స్పాట్లలో పశ్చిమ కనుమలు ఒకటి
2. పశ్చిమ కనుమలు హిమాలయ పర్వతాల కంటే పురాతనమైనవి
3. పశ్చిమ కనుమలు భారతదేశంలోని ఐదు రాష్ర్టాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి.
4. తమిళనాడులోని అనైముడి శిఖరం పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శిఖరం
పై ప్రకటనల్లో ఎన్ని సరైనవి?
ఎ) ఒకటి
బి) రెండు
సి) మూడు
డి) నాలుగు
సమాధానం: (బి)
వివరణ: పశ్చిమ కనుమలు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రపంచంలోని ఎనిమిది జీవవైవిధ్య హాట్స్పాట్లలో ఒకటి. కాబట్టి ప్రకటన-1 సరైనది.
- యునెస్కో ప్రకారం, పశ్చిమ కనుమలు హిమాలయాల కంటే పురాతనమైనవి. కాబట్టి ప్రకటన-2 సరైనది.
- పశ్చిమ కనుమలు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు (మొత్తం 6) రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి. కాబట్టి ప్రకటన-3 తప్పు.
- అనైముడి అనేది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా, ఇడుక్కి జిల్లాలో ఉన్న ఒక పర్వతం. ఇది పశ్చిమ కనుమల్లో, దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన శిఖరం. కాబట్టి ప్రకటన-4 తప్పు. కాబట్టి ఎంపిక (బి) సరైన సమాధానం.
5. లోక్‌సభ స్పీకర్‌ను ఏ సందర్భాల్లో తొలగించవచ్చు?
1. లోక్‌సభలో మెజారిటీ సభ్యులు తీర్మానం ఆమోదించటం ద్వారా
2. లోక్‌సభలో ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించటం ద్వారా
3. సుప్రీంకోర్ట్ విచారణ ద్వారా
4. రాష్ట్రపతి ఉత్తర్వు / ఆదేశం ద్వారా
పైన పేర్కొన్న ప్రకటనల్లో సరైనవి ఎన్ని?
ఎ) ఒకటి
బి) రెండు
సి) మూడు
డి) నాలుగు
సమాధానం: (ఎ)
వివరణ: లోక్‌సభ స్పీకర్ పదవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం సృష్టించారు. భారత ప్రభుత్వ చట్టం 1919లోని నిబంధనల ప్రకారం భారతదేశంలో స్పీకర్ కార్యాలయం 1921లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్పీకర్‌ను అధ్యక్షుడిగా పిలిచేవారు. 1935లో అధ్యక్షుడనే పదాన్ని స్పీకర్‌గా మార్చారు. 1946, డిసెంబర్ 9 నుంచి 1947, నవంబర్ 16 వరకు స్పీకర్ పదవిని రాజ్యాంగ సభ రద్దు చేసింది. 1946 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిషత్తే శాసనసభగా వ్యవహరించింది. జి.వి.మౌలాంకర్ మొదటి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఎన్నిక: స్పీకర్‌ను లోక్‌సభ ప్రారంభ సమావేశంలో సభ్యులు మెజారిటీ ప్రాతిపదికపై నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు లోక్ సభలో సభ్యత్వం కలిగి ఉండాలి.
కాలపరిమితి: లోక్‌సభ స్పీకర్ పదవీ కాలం ఐదేళ్లు. కానీ, నూతన స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు. లోక్‌సభ రద్దయినా, తన కాలవ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు.
తొలగింపు పద్ధతి (ప్రకరణ 94 (c)): ప్రకరణ 94 ప్రకారం స్పీకర్‌ను లోక్ సభ తొలగిస్తుంది. పదవిని దుర్వినియోగపరచడం, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలపై స్పీకర్‌ను తొలగించవచ్చు. సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందస్తు నోటీసును స్పీకర్‌కు ఇవ్వాలి. సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ తన పదవి నుంచి దిగిపోతాడు.
- స్పీకర్‌ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు. కానీ, సమావేశానికి హాజరు కావచ్చు. తీర్మానంపై తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. తీర్మానంపై సాధారణ సభ్యుడిగానే ఓటు వేయవచ్చు. కానీ, నిర్ణయాత్మక ఓటు ఉండదు.
రాజీనామా: స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తారు.
ఏదైనా బిల్లు విషయంలో అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానమై ప్రతిష్టంభన ఏర్పడితే స్పీకర్ నిర్ణయాత్మక ఓటును (Casting Vote) వినియోగిస్తారు.
ప్రత్యేక అధికారాలు:
- ద్రవ్య బిల్లులను ధ్రువీకరిస్తారు. స్పీకర్ ధ్రువీకరణే అంతిమం.
- సాధారణ బిల్లు విషయంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఏర్పాటుచేసే సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
స్పీకర్ స్థానం : భారత అధికార హోదాలో ఏడోస్థానం కలిగి ఉండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా గౌరవ హోదాను పొందుతారు.
6. ఇటీవల కాలంలో USB మొబైల్ చార్జర్‌కి బదులుగా వైర్లెస్ మొబైల్ చార్జర్ వాడకం పెరుగుతుంది. వైర్లెస్ మొబైల్ చార్జర్ కింది సూత్రాల్లో దేనిపై ఆధారపడి పని చేస్తుంది?
ఎ) బెర్నౌలీ సూత్రం
బి) ఆర్కిమెడిస్ సూత్రం
సి) విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం
డి) పాస్కల్ నియమం
సమాధానం: (సి)
వివరణ:
బెర్నౌలీ సూత్రం : ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచేటపుడు తలంపైన పీడనం, కింద పీడనం కంటే తక్కువ ఉంటుంది. దీన్నే బెర్నౌలీ సూత్రం అంటారు.
అనువర్తనాలు: గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరిగేటప్పుడు గోడకు వేలాడదీసిన క్యాలెండర్ పేజీలు పైకి ఎగరడం, తుపాను గాలికి తాటాకుల గుడిసె పైకప్పు ఎగిరిపోవడం, విమానాలు గాలిలో ప్రయాణించడం, గాలిపటం భూమి నుంచి కొంత ఎత్తులో ఎగరడం, క్రికెట్ ఆటలో బంతి స్పిన్ తిరగడం….
ఆర్కిమెడిస్ సూత్రం: ఏదైనా ద్రవంలో వస్తువును పూర్తిగా లేదా పాక్షికంగా ముంచినప్పుడు నీటిలో కోల్పోయినట్లు అనిపించే బరువుకు, అది తొలగించిన నీటి బరువు సమానం అవుతుంది. దీన్నే ఆర్కిమెడిస్ సూత్రం అంటారు.
అనువర్తనాలు: నీటిలో జలాంతర్గాములు పనిచేసే విధానం, నీటిలో పడవలు తేలడం, హైడ్రో మీటర్లు, లాక్టోమీటర్లు పనిచేసే సూత్రం…
విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం : ఒక సంవృత వలయంలో ఏర్పడిన విద్యుచ్ఛాలక బలం విలువ దాని నుంచి వెళ్లే అయస్కాంత అభివాహపు మార్పు రేటుకు సమానం. విద్యుదయస్కాంత ప్రేరణ ఏర్పడినప్పుడు యాంత్రిక శక్తి, విద్యుత్తు శక్తిగా మారుతుంది. ఇది శక్తినిత్యత్వ నియమానికి విరుద్ధంగా ఉంటుంది. దీన్ని మైకేల్ ఫారడే ప్రతిపాదించాడు.
అనువర్తనాలు: వైర్లెస్ చార్జింగ్, ఇండక్షన్ స్టవ్, ఏటీఎం కార్డులో ఉండే అయస్కాంత పట్టి, సెక్యూరిటీ చెకింగ్ యంత్రాలు..
వైర్లెస్ చార్జింగ్ అనేది విద్యుదయస్కాంత ప్రేరణ ద్వారా ఫోన్ వెనుక భాగంలో ఉన్న రిసీవర్‌కు చార్జర్ నుంచి శక్తిని బదిలీ చేయడం ద్వారా పనిచేస్తుంది. చార్జర్ ఒక ప్రత్యామ్నాయ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి ఇండక్షన్ కాయిల్‌ను ఉపయోగిస్తుంది. వైర్లెస్ చార్జర్లు 100% సురక్షితమైనవి. ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌తో స్మార్ట్ ఫోన్ /పరికరాల భద్రతకు భరోసానిస్తుంది.
పాస్కల్ నియమం: ఏదైనా వస్తువు మీద కలుగజేసిన పీడనం అన్ని వైపులా సమానంగా విస్తరించబడుతుంది. దీన్నే పాస్కల్ నియమం అంటారు. ఈ నియమం ద్వారా ఎక్కువ పీడనాన్ని తక్కువ ప్రాంతంలో కలుగజేసి దాన్ని విస్తరింపజేయడం వల్ల ఎక్కువ పని జరుగుతుంది.
అనువర్తనాలు: సిరంజీ, హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ క్రేన్లు. కాబట్టి ఎంపిక (సి) సరైన సమాధానం.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

