డయాబెటిస్తో పాటు ఇప్పుడు ప్రీ డయాబెటిస్ అన్నది కూడా ఆరోగ్య హెచ్చరికలా డాక్టర్లు చెబుతున్నారు. ఈ దశలో ఉన్నవాళ్లు ఏవైనా ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా మధుమేహం రాకుండా పొడిగించుకునే అవకాశం ఉందా. వాళ్లు ఇందుకు ఏం చేయాలో తెలుపగలరు?
– ఓ పాఠకురాలు
Food Science | డయాబెటిస్‌కు ముందు దశలో మనం బరువు పెరగడాన్ని గమనించవచ్చు. దీంతో శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అస్తవ్యస్తమైన ఆహారపు సమయాలు, అలవాట్లు ఉన్న వాళ్లతో పాటు పీసీఓఎస్ ఉన్నవాళ్లకూ ఈ ఇన్సులిన్ సమస్య వస్తుంది. అలాగే విటమిన్ డి, విటమిన్ బి12 తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి ఆహార అలవాట్లు, జీవనశైలి చాలా మారింది.
ఇప్పుడన్నీ స్మార్ట్. ఎంత కదలకుండా అన్ని పనులూ చక్కబెడితే అంత గొప్ప అనుకుంటున్నాం. కాబట్టి జీవక్రియ దానికి తగ్గట్టే తయారవుతుంది. బరువు పెరిగిపోతున్నాం. మధుమేహం బారిన పడుతున్నాం. అంతేకాదు, ప్రకృతి సహజ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
శరీరంలోని ఇన్ఫ్లమేషన్ (వాపులు)ను ఇవి తగ్గిస్తాయి. అలాగే ఇన్సులిన్ పనితీరు బాగుండేందుకు తక్కువ మోతాదులోనే అయినా విటమిన్-డి 3 చాలా అవసరం. చీజ్, చేపల్లాంటి వాటిలో ఇది ఉంటుంది. లేదా సప్లిమెంట్గానూ తీసుకోవచ్చు. అలాగే ఎండలో సమయం గడపడం చాలా ముఖ్యం. క్యాల్షియం, ఐరన్‌లాంటి సూక్ష్మ పోషకాలు కూడా డయాబెటిస్‌ని వాయిదా వేయడంలో తోడ్పడతాయి. వీటికోసం పాలు, పెరుగు, సీ ఫుడ్, క్యాల్షియం ఫోర్టిఫైడ్ ఆహారాలు తీసుకోవాలి.
నువ్వులు, బెల్లంలాంటి వాటిలో ఐరన్ దొరుకుతుంది. మైదా, పంచదారలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. పండ్లు, కూరగాయల్లాంటి సహజ ఆహారానికి చోటివ్వాలి. సూర్యరశ్మి పడే సమయంలో కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. అలాగే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకోవాలి. రాత్రి భోజనం త్వరగా పూర్తి చేయాలి. ఆహారానికి ఆహారానికి మధ్య ఎక్కువ విరామం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
పండ్ల రసాలు ముఖ్యంగా విటమిన్- డి శరీరం శోషించుకునేందుకు నిల్వ ఉంచేందుకు ఉపయోగపడే విటమిన్-సి కలిగిన నారింజ, నిమ్మ, బత్తాయిలాంటి పండ్ల రసాలు, ఇతర పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు పీచులు అధికంగా ఉండే చిరుధాన్యాలు, గోధుమల్లాంటివి తినాలి. వాల్నట్, బాదం, అవిసెల్లాంటి గింజలు కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్ వదిలేయాలి.
మొలకలు, పనీర్, సోయా, టోఫులాంటి ప్రొటీన్ ఉండే పదార్థాలూ ముఖ్యమే. ఆహారాన్ని నిష్పత్తుల్లో చెప్పాలంటే… 50 శాతం ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు లేదా పండ్లు, 25 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ప్రొటీన్ తీసుకోవాలి.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com