Human Skull : ఓ మహిళకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూస్తే అందులో మనిషి పుర్రె (Human Skull), ఎముకలు (Bones), విభూది (Sacred ash) దర్శనమిచ్చాయి. దాంతో ఆమె తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని ప్యారిస్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వ్యాసర్పాడికి చెందిన శృతి (Shruthi) అనే మహిళ ప్యారిస్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది.
ఇవాళ ఒక గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్ తనది కాదని చెప్పింది. దాన్ని తీసుకునేందుకు నిరాకరించింది. దాంతో దుకాణ యజమాని తన సిబ్బంది అందరి సమక్షంలో పార్శిల్ తెరిచి చూశాడు. అందులో మనిషి పుర్రె, ఎముకలు, విభూది ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు.
అనంతరం తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రుతి కుటుంబీకులకు, అదే షాపులో పనిచేసే దినేశ్ కుటుంబీకులకు గొడవలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే ఆమెను భయపెట్టేందుకు దినేశ్ ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు దినేశ్‌ను, అతని అనుచరులు శ్రీనివాసన్, జోసెఫ్‌ను అరెస్టు చేశారు.