మహబూబ్‌నగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో అక్రమాలు జరిగినట్టు బయటపడుతున్నా వికారాబాద్ జిల్లా అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు. ఈ వ్యవహారంలో అక్రమాలకు సహకరించి దొరికిపోయామనే భావనలో అధికార యంత్రాంగం నీళ్లు నములుతున్నది. అనవసరంగా ఈ వ్యవహారంలో అతిగా వ్యవహరించి షాడోకు సహకరించి తప్పుచేశామనే అపరాధ భావనతో ఉన్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. పరిహారం పంపిణీ విషయంలో రైతుల ఆవేదనను పట్టించుకోకుండా, కార్యాలయా లు చుట్టూ తిప్పి శాపనార్థాలు మూటకొట్టుకొ ని ఇప్పుడు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడటంతో తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. హకీంపేట భూ పరిహారం పంపిణీ లో అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస క థనాలు అధికారుల్లో దడ పుట్టించాయి.
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో రెవె న్యూ అధికారులు, కొందరు స్థానిక నేతలు కలిసి రికార్డులను దిద్ది భారీ ఎత్తున పరిహారం పక్కదారి పట్టించిన వ్యవహారం బయటపడి నా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. 2024 డిసెంబర్ 1న హకీంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 252లో భూములు కోల్పోయిన రైతుల వివరాలతో నోటిఫికేషన్‌ను స్వ యంగా అప్పటి కలెక్టరే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కూడా ఒక ప్లాన్ ప్రకారం విడుదల చేసి అక్రమాలకు ఆజ్యం పోసినట్టు బయటపడింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఓ చోటా కాంగ్రెస్ నేత షాడో గా వ్యవహరించి ఉన్నతాధికారులను గుప్పిట్లో పెట్టుకొని తనకు కావాల్సిన వారికి పరిహారం ఇప్పించేశారు. ఇదంతా కలెక్టర్ కార్యాలయం వేదికగా కొనసాగింది. అప్పటి అసిస్టెంట్ కలెక్టర్, భూసేకరణ అధికారిగా వ్యవహరించిన తీరు అనుమానస్పంగా ఉన్నది. చాలామంది రైతులకు పరిహారం అందలేదని కాగితాలు పట్టుకొని కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఏడాదిపాటు తిరిగినా పట్టించుకోలేదు. 34మంది రైతులు ఇప్పటికీ పరిహారం అందక తిరుగుతూనే ఉన్నారు. మరి కొంతమంది పరిహారం తక్కువ వచ్చిందని చేసిన ఫిర్యాదులన్నీ బుట్టదాఖలయ్యాయి. 150 ఎకరాలకు పైగా బినా మీ రైతులను సృష్టించి పరిహారం కొట్టేసినట్టు స్పష్టంగా బయటపడినా కలెక్టరేట్ మౌనము ద్ర దాల్చుతున్నది. కనీసం జరిగింది వాస్తవమా? కాదా? అని చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం నియోజకవర్గంలో భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఒక్కో ఎకరాకు ఒక్కో ప్లాటు కేటాయించారు. ఎకరా కోల్పోయిన రైతులకు 150 గజాల ప్లాటు, ఎకరా లోపు వారికి 75 గజాల ప్లాటు కేటాయించారు. ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు భూసేకరణలో కోల్పోతే అన్ని ప్లాట్లు కేటాయించారు. నిర్వాసితుల కాలనీలో అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నది. దీనికోసం టెండర్లను ఆహ్వానించి మూడు కంపెనీలకు వివిధ పనులు అప్పజెప్పినట్టు తె లుస్తున్నది. పనులు నాసిరకంగా ఉండటం.. కాలనీ ప్రారంభం కాకముందే తారురోడ్డు దెబ్బతినడం, ప్లాట్లలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, కల్వర్టులు విద్యుత్ సౌకర్యం కల్పించ డం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అసలు ఎన్ని కోట్లతో ఏయే కంపెనీలు నిర్వాసితుల ప్లాట్లను వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నరో వివరాలివ్వాలని టీజీఐఐసీ కోరినా సదరు జోనల్ అధికారి కూడా వివరాలను బహిర్గతం చేయడం లేదు. దీంతో ఇక్కడ కూడా అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
భూ పరిహారం పంపిణీ.. నిర్వాసితుల కాలనీ అభివృద్ధి పనులపై అనేక ఆరోపణలు వస్తున్నా ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రు లు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు జరిగాయని, రూ.కోట్లు దండుకున్నారని హకీంపేట మొత్తం కోడై కూస్తున్నా సైలెంట్‌గా ఉండటం వెనుక మర్మమేమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికే సీఎంకు, మంత్రులకు పొసగడం లేదు. సొంత జిల్లా మంత్రులకు కూడా నిధులు కేటాయించడం లేదని.. తమ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని మదనపడుతున్నారు. అందుకే సీఎం ఇలాకాలో అక్రమాలపై మంత్రులు స్పందించడం లేదనే వాదన వినిపిస్తున్నది. ఇక పార్టీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న తిరుపతిరెడ్డి.. తనను కాదని తన షాడోను రంగంలో దింపి అక్రమాలకు తెరతీసినందుకు ఆయన కూడా పట్టించుకోవడం లేదని పార్టీ నేతలే చెప్తున్నారు.
హకీంపేట సమీపంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భూములు కోల్పోయిన రైతుల అందించే పరిహారంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణలో వస్తున్న వరుస కథనాలకు గ్రామస్తులు స్పందించారు. కొంతమంది వాట్సాప్ గ్రూపులో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా చర్చించి.. త్వరలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ఈ అక్రమాలను పూర్తిస్థాయిలో విచారించాలని తీర్మానం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు వచ్చే ఆదివారం గ్రామసభ నిర్వహించి అదే వేదికగా సర్వే నంబర్ 252లో జరిగిన అక్రమాలన్నింటిపై అవసరమైతే విజిలెన్స్ విచారణ కోరాలని ఈ తీర్మానంలో పొందుపరచాలని కొంతమంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ గ్రామ ఉప సర్పంచ్ స్పందించి త్వరలో గ్రామసభ ఏర్పాటు చేసి అక్రమాల పాల్పడిన వారందరితో పరిహారం రికవరీ చేయించి.. ఆదర్శంగా నిలువాలని పిలుపునివ్వడం సంచలనం రేపుతున్నది.