Bill Gates : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (Microsoft founder) బిల్‌గేట్స్ (Bill Gates) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) పై సంచలన హెచ్చరికలు చేశారు. ఏఐ దుష్టశక్తుల చేతిలో చిక్కితే అది దాదాపు 100 కోట్ల మంది (100 Cr People) మరణాలకు దారితీసే పెను విపత్తుకు కారణం కావచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ఓ అమెరికన్ టీవీ ఛానల్ (US TV Channel) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తానుగా మానవాళిని నాశనం చేస్తుందని తాను భావించడం లేదని, అయితే దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు ఆధునిక ఏఐ టూల్స్‌ను ఉపయోగించి చేసే సైబర్ దాడులు, జీవాయుధాల ప్రయోగం వంటివి ఊహించని నష్టాన్ని కలిగిస్తాయని బిల్ గేట్స్ అన్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పరిశ్రమ స్వీయ నియంత్రణ సరిపోదని, ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని సూచించారు. వాషింగ్టన్లో దీనిపై చట్టం తీసుకురావడం తప్పనిసరని, ఇది పరిశ్రమపై కొంత భారం మోపినప్పటికీ, అభివృద్ధిని పెద్దగా నిరోధించదని అన్నారు.
బిల్‌గేట్స్ మాత్రమేగాక ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ వంటి ఇతర టెక్ నిపుణులు కూడా ఏఐ నియంత్రణ ఆవశ్యకతపై గళం విప్పారు. రాబోయే ఐదేళ్లలో మానవుల కంటే తెలివైన ‘సూపర్ ఇంటెలిజెంట్’ ఏఐ వ్యవస్థలు వచ్చే అవకాశం ఉందని, వాటిపై మానవ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని బ్రిటన్‌కు చెందిన అలన్ ట్యూరింగ్ ఇన్స్టిట్యూట్ నివేదిక కూడా హెచ్చరించింది. ప్రస్తుతం ఏఐ ఏజెంట్లు అనధికారికంగా హ్యాకింగ్ ప్రయత్నాలు చేయడం, డ్రోన్ దాడులకు ప్లాన్ చేయడం వంటి ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో గేట్స్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.