– ప్రొఫెసర్ డా.బి.ధర్మానాయక్
హుజూర్నగర్, సెప్టెంబర్ 29 : పేద విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ వరం లాంటిదని బిఆర్ఎఓయూ ఎక్స్టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి ప్రొఫెసర్ డా.బి.ధర్మా నాయక్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో నిర్వహించిన కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరవిద్య ద్వారా లభిస్తాయన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాలను అమలు చేస్తోందని, మహిళా విద్యార్థినులకు విహబ్ ద్వారా వ్యాపారాభివృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్ లైన్ లెర్నింగ్ పద్దతిలో ప్రపంచంలో ఎక్కడనుంచైనా తెలుగు, ఇంగ్లీష్ మాద్యమాల్లో పీజీ, ఎంబిఏ చేసే అవకాశం అంబేద్కర్ యూనివర్సిటీ లో మాత్రమే ఉందని వివరించారు.
యూనివర్సిటీ టీసీఎస్, ఐకాన్, రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్, రాశి, వీ హబ్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు అన్నారు. 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతు న్నాయని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి విద్యను మరింత సులభతరం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ రామారావు, కో ఆర్డినేటర్ ఎస్.బాలరాజు, సైదా నాయక్, అధ్యయన కేంద్ర కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.