20 నెలల్లో 6 వేల మందికిపైగా అరెస్ట్
ఉద్యోగం కోసం.. వీసా భద్రత కోసం.. అమెరికాలోని సగటు భారతీయ టెకీ నిత్యం బతుకుపోరాటం చేస్తున్నాడు. నిరంతరం మారుతున్న నిబంధనలు, ఉద్యోగ కోతలు, గ్రీన్ కార్డు అనిశ్చితితో సతమతమవుతున్నాడు.
- అమెరికాలో భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం
- డిపోర్టేషన్ కేంద్రాల్లో సుమారు 5,235 మంది
- 2,349 మంది దేశ బహిష్కరణ
- ట్రంప్ వలస విధానాలతో భారతీయుల్లో ఆందోళన
వాషింగ్టన్, నవంబర్ 22 : ఉద్యోగం కోసం.. వీసా భద్రత కోసం.. అమెరికాలోని సగటు భారతీయ టెకీ నిత్యం బతుకుపోరాటం చేస్తున్నాడు. నిరంతరం మారుతున్న నిబంధనలు, ఉద్యోగ కోతలు, గ్రీన్ కార్డు అనిశ్చితితో సతమతమవుతున్నాడు. ఉన్నత చదువును అభ్యసించినా చేతికి సంకెళ్లతో ఒక ఖైదీగా నిర్బంధ కేంద్రాల్లో మగ్గుతున్నాడు. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోపిన ఉక్కుపాదం కింద వేలాది మంది భారతీయులు నలిగిపోతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో, ఎప్పుడు అరెస్ట్ చేసి డిపోర్టేషన్ కేంద్రాలకు తరలిస్తారో, తమను దేశం నుంచి పంపేస్తారో అన్న భయంతో వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.
అమెరికన్ కమ్యూనిటీ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) 6,111 మంది భారతీయులను అరెస్టు చేసింది. అమెరికాలో భారతీయుల అరెస్టులకు సంబంధించి నమోదైన అత్యధిక సంఖ్య ఇదేనని నివేదిక పేర్కొన్నది. అరెస్టయిన వారిలో 5,235 మందిని డిపోర్టేషన్ కేంద్రాల్లో ఉంచగా, 2,349 మందిని భారత్కు వెనక్కి పంపారు. ఈ నెలలో జరిగిన మధ్యంతర ఎన్నికలకు ముందే ఐసీఈ దాడులను పెంచింది. ఆసియా-పసిఫిక్ వర్గంలో అరెస్టులు, నిర్బంధాలు, దేశబహిష్కరణలకు గురైన వారిలో భారతీయుల సంఖ్యే అధికంగా ఉందని స్టాప్ ఏఏపీఐ హేట్ సంస్థ తెలిపింది. దక్షిణాది రాష్ర్టాల్లో హిస్పానిక్, నల్లజాతి మూలాలున్న వారిపైనా ఐసీఈ చర్యలు తీసుకున్నదని తెలిపింది.
దశాబ్దాలుగా ఉంటున్నా..
దశాబ్దాల నుంచి అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కొందరికి కూడా వేధింపులు తప్పడం లేదు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న 60 ఏండ్ల భారతీయ మూలాల మహిళ బబ్లీని (పేరు మార్చారు) అధికారులు నిర్బంధించారు. గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్స్ ప్రక్రియ కోసం ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి రావాలని ఆమెకు సమాచారం ఇచ్చారు. బబ్లీ 1994 నుంచి అమెరికాలో నివసిస్తున్నది. ఆమె గ్రీన్ కార్డుకు కూడా ఆమోదం లభించినట్లు కథనం తెలిపింది. భారతీయురాలు కావడంతోనే ఆమెను వేధించారని, వారం తర్వాత కస్టడీ నుంచి విడుదల చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
16 ఏండ్లలో అత్యధిక డిపోర్టేషన్లు
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినవారి అరెస్టులు, దేశబహిష్కరణలు రెండూ పెరిగాయని ఐసీఈ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా వెనక్కి పంపించే అక్రమ వలసదారుల సంఖ్య రికార్డు స్థాయికి చేరనున్నదని ఆయన పేర్కొన్నారు. 2025లో దేశ బహిష్కరణ చేసిన 3,000 మందికిపైగా భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారేనని తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్ దాటినా బహిష్కరణ వేటే
పౌరులను దేశ బహిష్కరణకు అగ్రరాజ్యం చూపుతున్న కారణాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. అమెరికాలోకి వెళ్లిన నిపుణులను కూడా వివిధ ఉల్లంఘనల ఆరోపణలతో డిపోర్ట్ చేస్తున్నారు. అమెరికాలోని ఒక నగరంలో రెడ్ లైట్ దాటినందుకు విద్యార్థులను డిపోర్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
నోరు మెదపని మోదీ ప్రభుత్వం..
వేలాది మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా భారత్కు పంపేస్తున్నా మోదీ ప్రభుత్వం మాత్రం నోరుమెదపడం లేదు. 2025 ఫిబ్రవరి 5న తొలిసారిగా 104 మంది భారతీయులను అమెరికా సైనిక విమానంలో అమృత్సర్కు పంపింది. వారిలో పలువురికి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసినట్లు ఫొటోలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది. పార్లమెంట్లోనూ ఆందోళన వ్యక్తమైంది. దీనిపై మోదీ ప్రభుత్వం ఎలాంటి ఖండన చేయలేదు. అమెరికా గత ఏడాది 3,567 మంది భారతీయ పౌరులను బహిష్కరించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

