తాగునీటికి తండ్లాట!
మహానగరంలో తాగునీటి సమస్య తాండవిస్తున్నది. రోజురోజుకు నీటి సమస్య తీవ్రమవుతున్నది.
- అంబేద్కర్‌నగర్ బస్తీలో నీళ్లు కావాలంటే 15 రోజులు ఆగాల్సిందే
- 160 ఇండ్లకు రెండు కనెక్షన్లతో మూడురోజులకోసారి తాగునీటి సరఫరా
- సంపులో నింపుకొని వంతులవారీగా వాడుకుంటున్న బస్తీ ప్రజలు
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహానగరంలో తాగునీటి సమస్య తాండవిస్తున్నది. రోజురోజుకు నీటి సమస్య తీవ్రమవుతున్నది. ముఖ్యంగా బస్తీలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. సాధారణంగానే బస్తీలకు తాగునీటి సరఫరా అరకొరగా ఉంటుంది. నల్లా కనెక్షన్లు లేని బస్తీలు నీళ్ల ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది.
అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. వర్షాభావ పరిస్థితుల వల్ల సిటీలోని బస్తీల్లో పరిస్థితులు మరింత దారణంగా రయ్యాయి. గుక్కెడు తాగునీటి కోసం రోజుల తరబడిగా ఎదురుచూడాల్సి వస్తున్నది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని అంబేద్కర్ నగర్ బస్తీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 160 కుటుంబాలున్న ఆ బస్తీలో ఇంటికి తాగు నీళ్లు రావాలంటే 15 రోజులు ఆగాల్సిన దుస్థితి నెలకొన్నది.
పదిహేను రోజులకు ఒకసారి వచ్చే నీటిని డమ్ముల్లో పట్టుకుని అత్యంత పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగేందుకు మాత్రం ప్రతిరోజు బిందెలతో మోసుకుని పోవాల్సి వస్తుందని అంబేద్కర్ నగర్ బస్తీ వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ముందుగానే నీళ్లు అయిపోతే ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారుతున్నది. తమ పరిస్థితిపై జలమండలి అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని సైతం అనేకసార్లు కలిసి బస్తీకి తగినన్ని నీళ్లు సరఫరా చేయాలని వేడుకున్నామని.. అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
160 కుటుంబాలకు రెండే కనెక్షన్లు

అంబేద్కర్‌నగర్ బస్తీలో 50 ఏండ్లుగా 160 కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారు. బస్తీ మొత్తానికి కలిపి రెండు అర ఇంచు కనెక్షన్లు ఇచ్చారు. వాటి నుంచి మూడు రోజులకు ఒకసారి అర గంట పాటు నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు బస్తీలోని 160 కుటుంబాలకు ఏ మూలకూ సరిపోకపోవడంతో ఒక సంపు ఏర్పాటు చేసుకుని అందులో నింపుకొని వంతుల వారీగా పంపింగ్ చేసుకుంటున్నారు. బస్తీలో మొత్తం 9 గల్లీలు ఉండగా, రోజుకి ఒక గల్లీకి మాత్రమే నీటిని సరఫరా చేస్తారు. ఒక్కోసారి నీళ్లు తక్కువగా రావడంతో రెండు రోజులకు ఒక గల్లీకి సరఫరా చేసుకుంటున్నారు.
దీంతో ఒక్కో గల్లీలోని ఇండ్లకు నీళ్లు వచ్చేసరికి 15 రోజుల సమయం పడుతుంది. తమ వంతు వచ్చినప్పుడు డ్రమ్ముల్లో నింపుకొని నిల్వ చేసుకుంటున్నారు.గతం ప్రభుత్వ హయాంలో రెండు కనెక్షన్లు ఉన్నా ప్రతిరోజూ బస్తీ మొత్తం సరిపోయేంత సరఫరా అయ్యేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సరఫరా పూర్తిగా తగ్గించారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మూడు నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని.. మూడు రోజులకోసారి నీళ్లు వచ్చినా లోప్రెషర్, అర్ధ గంట కంటే ఎక్కువ ఇవ్వడం లేదని చెప్తున్నారు. దీంతో ఆ నీళ్లను 160 ఇండ్లకు సరఫరా చేయలేని పరస్థితుల్లో వంతుల వారీగా వాడుకుంటున్నామని వాపోతున్నారు.
పని ప్రాంతంలోనే బహిర్భూమికి

అంబేద్కర్ నగర్ బస్తీలో నివసించే 160 కుటుంబాలు ప్రజలు దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకుని జీవిస్తున్నారు. బస్తీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో వారు పనిచేసే ప్రాంతంలోనే బహిర్భూమికి వెళ్తున్నామని వాపోతున్నారు. గుక్కెడు నీళ్లు వృథా కాకుండా అత్యంత పొదుపుగా వాడాల్సి వస్తుందంటున్నారు. కొన్నిసార్లు స్నానం కూడా రెండు రోజులకు ఒకసారి చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
బస్తీలోని 9 గల్లీలకు జలమండలి పైపులైన్ ఏర్పాటు చేసినా.. ఇండ్లకు పట్టాలు లేవనే నెపంతో ఇంటింటి కనెక్షన్లు ఇవ్వకుండా నిలిపేశారని వాపోతున్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకున్నా ఉన్న రెండు కనెక్షన్ల ద్వారా తగినన్ని నీళ్లు సరఫరా చేయాలని జలమండలి అధికారులను వేడుకన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రూ.68 లక్షలతో రోడ్డు మంజూరైనా నిర్మించలేని దుస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అధికారులు నీటి కష్టాలను తొలగించాలని వేడుకుంటున్నారు.
నీళ్లు బంగారం అయినయ్
మాకు మంచినీళ్లు బంగారం అయినయ్. ఒక్కో ఇంటికి 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నయి. బియ్యం కడిగిన నీళ్లు, బట్టలు ఉతికిన నీళ్లు, అన్నం తిని చేతులు కడుక్కున్న నీళ్లను బాత్రూంలకు వాడుతున్నాం. ఒక్కసారే డ్రమ్ములకు నింపుకొని 15 రోజులు బంగారం లాగా వాడుకోవాల్సి వస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు రోజూ నీళ్లు వచ్చేవి. ఒక్కోసారి ఎక్కువ కూడా అయ్యేవి. ఇప్పుడు రోజుల తరబడిగా ఎదురు చూడాల్సి వస్తున్నది. ప్రభుత్వం, అధికారులు మా కష్టాలు చూసైనా నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం.
– పద్మ, అంబేద్కర్ నగర్ బస్తీవాసి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

