Thella Panchami : సోమవారం నాడు దేశమంతా నాగుల పంచమి (Nagula Panchami) జరుపుకొంటే ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచమి (Thella Panchami) జరుపుకున్నారు. నాగుల పంచమి రోజున తేళ్ల పంచమి జరుపుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తున్నది. నారాయణపేట జిల్లా (Narayanapet District) సరిహద్దుల్లో కర్ణాటక రాష్ట్రం (Karnataka State) లోని యాద్గిర్ జిల్లాలోగల గురుమిట్కల్ మండలం కందుకూరులో ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. ఇక్కడ తేళ్లను దైవస్వరూపంగా భావిస్తూ ఏటా ప్రత్యేకంగా తేళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమవ్వ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని, అక్కడే ఉన్న తేళ్ల విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా వాటి కింద తేళ్లు కనిపించాయి. తేళ్లను చేతితో తాకినా, పట్టుకున్నా అవి కుట్టకపోవడం అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. చిన్నారులు, యువత, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లోకి తీసుకుని, చేతులు, పొట్ట, ముఖం తదితర శరీర భాగాలపై పెట్టుకుని జాతరలో సందడి చేశారు.
గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వన మూలికల కారణంగా తేళ్లు కుట్టలేకపోతున్నాయని కొందరు విద్యావంతులు చెబుతున్నారు.