The Paradise | న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారీ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో నాని సినిమాకు వస్తున్న ఆదరణ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తమిళ ప్రేక్షకుల్లో నానికి ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి సినిమాతోనూ అక్కడ తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటూ వస్తున్న నాని.. ‘ది ప్యారడైజ్’తో మరోసారి తన సత్తా చాటుతున్నట్లు అడ్వాన్స్ బుకింగ్స్ సూచిస్తున్నాయి. చెన్నైలో ఈ సినిమా ప్రీమియర్ షోలతో కలిపి ఇప్పటికే రూ.1 కోటి మార్కును దాటినట్లు సమాచారం. దీంతో నాని కెరీర్లోనే చెన్నైలో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించే సినిమాగా ‘ది ప్యారడైజ్’ నిలిచినట్లు తెలుస్తోంది.
కేవలం చెన్నైకే పరిమితం కాకుండా తమిళనాడు వ్యాప్తంగా కూడా సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తోంది. నాని గత చిత్రాలతో పోలిస్తే ‘ది ప్యారడైజ్’కు వస్తున్న స్పందన గణనీయంగా పెరిగినట్లు బుకింగ్స్ ట్రెండ్ చెబుతోంది. ముఖ్యంగా సినిమా ప్రచార కార్యక్రమాలు, నాని పాత్ర లుక్, శ్రీకాంత్ ఓదెల గత చిత్రం ‘దసరా’కు వచ్చిన స్పందన కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచిన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలోనూ ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రీమియర్ షోలతో కలిపి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ.3.25 కోట్ల వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం కర్ణాటకలోనూ నాని కెరీర్లోనే అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించే చిత్రంగా ‘ది ప్యారడైజ్’ రికార్డు సృష్టించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ.50 కోట్ల వరకు అడ్వాన్స్ కలెక్షన్లు నమోదైనట్లు సమాచారం. ఈ లెక్కలతో మిడిల్ హీరో సినిమాలకి భారీ స్థాయిలో ముందస్తు వసూళ్లు సాధించిన చిత్రాలలో ‘ది ప్యారడైజ్’ ఒకటిగా నిలుస్తోంది. నాని గత చిత్రాలతో పోలిస్తే ఈ స్థాయి స్పందన రావడం ‘ది ప్యారడైజ్’పై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే చెన్నై, కర్ణాటక వంటి కీలక మార్కెట్లలో నాని కెరీర్ రికార్డులను అధిగమించడం ఆసక్తికరంగా మారింది. ప్రీమియర్ షోలు, తొలి రోజు వసూళ్లు కూడా ఇదే స్థాయిలో కొనసాగితే ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.