సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్ నుంచి ఆయుధాలను చోరీ చేసేందుకు ఆదివారం అయితేనే ఈజీగా ఉంటుందని మాజీ ఆర్మీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ నిర్ణయించి, ఆగస్టు 30వ తేదీ రాత్రి చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆర్మీలో చేరక ముందే దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడనే విషయం విచారణలో బయటపడింది. అయితే ఈ కేసులు కొట్టేసినట్లు సమాచారం. మద్రాస్ రెజిమెంట్ కోట్ నుంచి ఏకే 47, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ని దొంగిలించిన మాజీ హవల్దార్ మల్లేశ్‌ను ఈ నెల 11వ తేదీన బొల్లారం పోలీసులు అరెస్ట్ చేసి, చోరీ చేసిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
దేశ భద్రతకు, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ఆర్మీ ఇంటెలిజెన్స్ నిందితుడిని పట్టుకోవడం కోసం పది రోజుల పాటు కష్టపడ్డారు. మొదటి నుంచి ఆయుధాల చోరీ ఇంటి దొంగ పనే అని అనుమానిస్తూ దర్యాప్తు జరిపిన పోలీసులకు అదే నిజమనే విషయం బయటపడింది. నిందితుడికి సోషల్‌మీడియాలో ఉగ్ర సానుభూతి పరులతోనూ సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు భిన్న కోణాల్లో ందితుడి వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నిందితుడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకొని కర్ఖాన పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. మొదటి రోజే నిందితుడు గతంలో చేసిన దొంగతనాల విషయం బయటపడింది.
2005లో అచ్చంపేట్, 2007లో అమ్రాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు వెలుగులోకి రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతిన్నారు. ఆ కేసులు కొట్టేసిన తరువాతనే 2010లో మల్లేశ్ ఆర్మీలో చేరినట్లు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే మల్లేశ్ ఆర్మీలో ఉద్యోగం చేరిన సమయంలో ఇతడి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగిందా..? ఒక వేళ జరిగి ఉంటే.. అప్పట్లో ఏం రిపోర్టు పెట్టారనే నివేదికలను కూడా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. నేర స్వభావం ఉన్న ఒక వ్యక్తిని ఆర్మీలోకి తీసుకోవడం, ఉద్యోగంలోకి వెళ్లిన తరువాత ఆర్మీలో పనిచేస్తూ ఇంకా ఎక్కడైనా చోరీలు చేశాడా? ఆయుధాలకు సంబంధించిన చోరీ చేసి ఇతరులకు అమ్ముకున్నాడా? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అతడు ఎక్కడెక్కడ పనిచేశాడనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు సమాచారం. మరో పక్క రెండో రోజు నిందితుడి విచారణ కొనసాగింది. ఏసీపీ స్థాయి అధికారులు నిందితుడిని విచారించి ఎప్పటికప్పుడు నిందితుడి నుంచి వచ్చే సమాచారాన్ని అధికారులకు పంపిస్తున్నారు. అయితే వినాయక నిమజ్జనం పూర్తయిన తరువాత నిందితుడిని ఐపీఎస్ స్థాయి అధికారులు ప్రత్యేకంగా విచారణ చేసే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
అందులో బాగంగానే ఆర్మీ ఇంటెలిజెన్స్ కూడా నిందితుడిని విచారించి అసలు ఆయుధాలు ఎక్కడి తరలించాలని ఫ్లాన్ చేశాడనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు విచారణలో చాలా విషయాలపై దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నా, అతడి నుంచి వచ్చే కొద్ది సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేస్తూ మరింత సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా కంటోన్మెంట్లో భద్రత పరంగా ఆదివారం తక్కువగా ఉంటుందని, అధికారుల కదలికలు ఉండవని హవల్దార్‌గా పనిచేసిన నిందితుడు మల్లేశ్‌కు తెలుసు. అందులో భాగంగానే ఆదివారమే దొంగతనానికి సేఫ్ డే అని భావించి ఆదివారమే తన దొంగతనానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఆయుధాలు చోరీ చేసినట్లు బయటపడింది.