రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎప్పుడూ జరుగని విధంగా గ్రామాలు, కాలనీలు, లక్షల ఎకరాల భూములు ‘22ఏ’ పరిధిలోకి వెళ్లిపోయాయి. లక్ష కోట్ల ఆసులు బ్లాక్‌లిస్టులో చేరిపోయాయి. ‘మా భూములు, ఇండ్లు విడిపించండి మహాప్రభో’ అంటూ సగటుజీవి ప్రభుత్వానికి మొరపెట్టుకోవాల్సి వస్తున్నది. నలుదిశలా నేల కదిలిపోతున్న వేళ.. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ‘22ఏ జాబితాతో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగనివ్వం. వివాదం లేని వాటిని బై నంబర్లు వేసైనా అన్‌బ్లాక్ చేస్తం’ అని ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే!
హైదరాబాద్ శివారులో కొన్ని నెలలుగా అసైన్డ్ భూములకు యథేచ్ఛగా ఒప్పందాలు జరిగిపోతున్నాయి. బిగ్ బ్రదర్స్, ప్రభుత్వ పెద్దలు, పలువురు మంత్రులు, బడా బాబులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపారులు ఇదే పనిలో తలమునకలై ఉన్నారు. రైతులకు డబ్బులు ఆశచూపి, ఒప్పంద పత్రాలు, ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.
రెండింటినీ వేర్వేరుగా చూస్తే.. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ, కలిపి చూస్తే లోగుట్టు అర్థమవుతుంది. 22ఏ రికార్డుల సవరణ మాటున వేల ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేసేందుకు రచించిన పన్నాగం స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా అనధికారిక ఒప్పందాలు చేసుకుని, ఆనక వాటిని సక్రమం చేసుకునే కుతంత్రం అవగతమవుతతుంది.
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అసైన్డ్ భూములపై అనధికారిక ఒప్పందాలు ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఊహించనిరీతిలో రూ.వందల కోట్ల పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. ఫోర్త్‌సిటీకి ఆనుకొని ఉండటమే అందుకు కారణం.
మహేశ్వరం మండలంలోనే గత రెండు, మూడు నెలల్లో 3-4 వేల ఎకరాల అసైన్డ్ భూములపై అనధికారిక ఒప్పందాలు ముగిసినట్టు తెలిసింది. ఇందుకనుగుణంగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ఆ భూముల రికార్డులను మాయం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో మంఖాల్‌లో 47 ఎకరాల అసైన్డ్ రికార్డులను తారుమారు చేసి, పట్టా భూములుగా మార్చారని చెప్తున్నారు. అదే తరహాలో మూడు నెలలుగా పెద్దఎత్తున అనధికారిక ఒప్పందాలు జరిగినట్టు సమాచారం. శ్రీనగర్ గ్రామంలో 120, 116 సర్వేనంబర్లలోని అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేందుకు రైతులతో భూమి రకం (చేంజ్ ఆఫ్ ల్యాండ్ టైప్), ఇతర వివరాలు మార్చాలని డాటా కరెక్షన్కు దరఖాస్తు కూడా చేయిస్తున్నారట.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆస్తులు నిషేధిత జాబితాలో పడ్డాయంటూ ప్రజలు గగ్గోలు పెడుతుంటే ‘మీకేం ఫర్వాలేదు.. మేమున్నాం!’ అంటూ సర్దుబాటు ముసుగులో అసలు కార్యాన్ని పూర్తిచేయాలని ప్లాన్ వేశారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అధికార వర్గాలు, నిపుణుల నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
భూకంపం ఆగిపోయిన తర్వాత భూ పొరలు కుదురుకున్నట్టుగా.. నిషేధిత జాబితాలో సృష్టించిన ప్రకంపనలను చల్లార్చేందుకు చేపడుతున్న సవరణల్లో అసైన్డ్ భూములను ‘22ఏ’ జాబితా నుంచి తొలిగించి, పట్టాభూమిగా మార్చేందుకు ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని నెలలుగా యథేచ్ఛగా సాగుతున్న అసైన్డ్ భూముల ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. బిగ్ బ్రదర్స్ మొదలు పలువురు మంత్రులు, రియల్ వ్యాపారంలో ఆరితేరిన అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, చివరికి నిర్మాణ రంగ సంస్థలకు చెందిన బడాబాబులు సైతం ఇదే పనిలో ఉన్నట్టు చెప్తున్నారు.
గతంలో ‘నమస్తే తెలంగాణ’ అనేక అసైన్డ్ భూ దందాలను బట్టబయలు చేసిన నేపథ్యంలో, ఈ దఫా అత్యంత పకడ్బందీగా ఒప్పందాలను పూర్తి చేస్తుండటం గమనార్హం. దళారులను రంగంలోకి దింపి, అసైన్డ్ రైతులను ఒక దగ్గరకు చేర్చి, స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. ఆ ఒప్పంద పత్రాల జిరాక్స్ కాపీలు కాదు కదా.. కనీసం ఫోన్లో ఫొటో తీసుకునేందుకు కూడా అనుమతించడం లేదని సమాచారం. కేవలం చెక్కులు చేతుల్లో పెట్టి బయటికి పంపుతున్నారు. ఇక భూ భారతిలో ఆ భూములన్నింటినీ పట్టా భూములుగా మార్చడమే మిగిలి ఉన్నది.

రాష్ట్రంలో ప్రస్తుతం సామాన్యుడి ఆస్తులకు భద్రత కరువైంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధుల్లో దశాబ్దాల నుంచి ఉన్న కాలనీలు, ప్రైవేట్ భూములు, ఆస్తులపై ‘22ఏ’ కత్తి వేలాడుతున్నది. వాస్తవానికి నిషేధిత జాబితాలు అనేవి ఇప్పుడేమీ కొత్తవి కావు. ధరణి కంటే ముందు ఉన్నాయి, తర్వాత కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుడు ఏప్రిల్- నవంబర్ మధ్య జిల్లా కలెక్టర్లందరూ తమ పరిధిలోని ‘22ఏ’ భూముల జాబితాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలకు పంపారు. అవి భూ భారతి సైట్లో అప్లోడ్ అయ్యాయి. మరి ప్రజల్లో అప్పటి నుంచి కనిపించని అలజడి, ఆందోళన గత రెండు, మూడు నెలలుగా ఎందుకు వ్యక్తమవుతున్నది? అనేది అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నది.
దీనిపై కొందరు అధికారులను సంప్రదించగా వాళ్లు ఇటీవలి కాలంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వెళ్లారు కాబట్టి బయటికి వచ్చి ఉండవచ్చు! అని సాకులు చెప్తున్నారు. అయితే.. అసలు కారణం అది కాదని, నిషేధిత జాబితాల్లో ఇష్టానుసారంగా మార్పులు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడి ఆస్తులను నిషేధిత జాబితాలో ఉంచాలనే ఉద్దేశం కాదుగానీ.. కొందరు ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వాటిని జాబితా నుంచి తొలగించడం, టార్గెట్ చేసిన వాటిని జాబితాలోకి ఎక్కించే క్రమంలోనే ఈ భారీ కుదుపు చోటుచేసుకున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వెలుగులోకి వచ్చిన భూ దందాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

రాష్ట్రంలో అసైన్డ్ భూముల అనధికారిక కొనుగోళ్లపై రెండున్నర సంవత్సరాలుగా అనేక దందాలు బయటికొచ్చాయి. నగరం చుట్టూ 15-20 కిలోమీటర్ల దూరంలోని భూములకు కనీసం ఎకరా ధర రూ.10-20 కోట్ల వరకు ఉంటుంది. దీంతో రైతుల నుంచి అగ్గువకు ఈ భూములను చేజిక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున రంగంలోకి దిగారు. రూ.కోట్ల విలువ ఉన్న చోట అసైన్డ్ భూములను రైతుల నుంచి ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించి అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇందులో బిగ్ బ్రదర్స్, కొందరు మంత్రులతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరి పేర్లు చెప్పి స్థానిక నాయకులు, దళారులు ప్రవేశిస్తున్నారు. మొండికేసే రైతులకు నేరుగా పెద్దల నుంచి ఫోన్లు వెళ్తున్నాయని సమాచారం. ఫోర్త్ సిటీ పరిసరాల్లో అసైన్డ్ భూములు అమ్మేందుకు నిరాకరించినా, భారీ మొత్తం కావాలని డిమాండ్ చేసినా.. పెద్దలు ఫోన్ చేసి ‘మా మాట వినకుంటే ప్రభుత్వమే నేరుగా భూ సేకరణ చేసి, గుంజుకుంటుంది’ అని బెదిరిస్తున్నట్టు సమాచారం.
దీంతో భూ సేకరణతో వచ్చే మొత్తం కంటే వీళ్లు అనధికారిక ఒప్పందాలతో ఎక్కువగా ఇస్తుండటంతో రైతులు తప్పినసరి పరిస్థితుల్లో ఇచ్చేస్తున్నట్టు సమాచారం. ముందుగా పదుల సంఖ్యలో రైతులకు తలా రూ.లక్ష, రెండు లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నారని, తర్వాత వారిని గండిపేట ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఒప్పందాల ప్రక్రియ నిర్వహిస్తున్నారని సమాచారం. ఒక గదిలో స్టాంపు పేపర్లపై ముద్రించిన ఒప్పందాలపై రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని అంటున్నారు.

అసైన్డ్ భూముల్ని పట్టా భూములుగా మార్చేందుకు సదరు కొనుగోలుదారుడు చేసే ప్రయత్నాలకు మొదటి పార్టీ (రైతులు) సహకరించాలనే షరతు అందులో పొందుపరుస్తున్నట్టు సమాచారం. వీటికితోడు తెల్ల కాగితాల మీద కూడా సంతకాలు చేయించుకుంటున్నట్టు పలువురు రైతులు తెలిపారు. అవసరమైతే గతంలో ఆ భూములు పట్టా భూములంటూ ఏదో ఒక సాకు చూపుతూ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆ తెల్ల కాగితాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇలా ఒకే దఫాలో కనీసం 80 ఎకరాల నుంచి గంపగుత్తగా 200 ఎకరాల వరకు అసైన్డ్ భూములను కొల్లగొడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. వీటన్నింటినీ భూ భారతిలో పట్టా భూములుగా మార్చేందుకు ప్రభుత్వ పెద్దలు కొందరు పావులు కదుపుతున్నారట.
ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయని అంటున్నారు. 22ఏ జాబితాలో మార్పులను అడ్డం పెట్టుకొని, తమకు కావాల్సిన భూములను విడిపిస్తారనేది ఒక వాదన. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక సందర్భంలో.. రాష్ట్రంలో 80వేల అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారికి న్యాయం చేస్తాం అని ప్రకటన చేశారు. దీంతో పరపతి ఉన్నవారు నేరుగా రికార్డులను మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని, లేనివారు మంత్రి ప్రకటన మేరకు మార్గదర్శకాలు వచ్చిన తర్వాత భూములను విడిపించునేందుకు ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. వీటన్నింటి విలువ రూ.వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల పేరిట పట్టా భూములతోపాటు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కూడా గుంజుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల బడా బాబులు అనధికారిక ఒప్పందాలు చేసుకున్న అసైన్డ్ భూముల జోలికి వెళ్లకుండా, పక్కనే ఉన్న పట్టా భూములు, ఒప్పందంకాని అసైన్డ్ భూములను పారిశ్రామిక అవసరాల పేరిట సేకరిస్తుండటం అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నది.
అందుకే కాంగ్రెస్ తెచ్చిన భూ భారతి 30 శాతం కమీషన్ దందాగా మారిందని, పెద్దల్ని సంప్రదించి ప్రసన్నం చేసుకుంటే తప్ప నిషేధిత జాబితాల్లోంచి భూములు తొలగించడం లేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. రెండు రోజుల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి ‘22ఏ’ నిషేధిత జాబితాల రూపకల్పనలో అధికారుల తప్పిదం ఉన్నదంటూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కానీ అసలు తప్పిదం ఎక్కడ జరిగింది? ఏ ‘మార్పులు’ చేసే క్రమంలో ఇది చోటుచేసుకున్నది? అనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు. రెండు రోజుల కిందట రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో మంత్రి జరిపిన సమీక్షలోనూ.. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై లోతైన చర్చ జరుగలేదని సమాచారం. ప్రజల్లో ఆందోళన, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మాత్రమే చర్చ జరిగిందని, జాబితాల్లో మార్పు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఓ అధికారి తెలిపారు.