లక్నో: సోదరుడిగా భావిస్తూ 15 ఏళ్లుగా రాఖీ కడుతున్న వ్యక్తితో ఒక యువతి ఇంటి నుంచి పారిపోయింది. అతడిని ప్రేమ వివాహం చేసుకున్నది. షాకైన ఆ యువతి కుటుంబ సభ్యులు, ఆమె చనిపోయిందంటూ కర్మకాండలు నిర్వహించారు. (woman marries brother) ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల నందనీ పాండే గత 15 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల శాశ్వత్ గుప్తాకు రాఖీ కట్టడంతో పాటు అతడిని అన్నగా భావించింది. అయితే సెప్టెంబర్ 20న వీరిద్దరూ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఒక గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా, ఆ మరునాడు ఇది తెలుసుకుని నందని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆమె ఇంటి నుంచి రూ.2 లక్షలు తీసుకెళ్లిందని ఆరోపించారు. తమ ఇంటికి తరచుగా వచ్చే శాశ్వత్కు 15 ఏళ్లుగా రాఖీ కడుతూ అన్నగా భావించిన అతడిని ప్రేమ పెళ్లి చేసుకోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తమ కుమార్తె చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు.
మరోవైపు శాశ్వత్తో ప్రేమ పెళ్లి తర్వాత నందని ఒక వీడియో విడుదల చేసింది. తాను, అతడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. పరస్పర అంగీకారంతోనే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. తన భర్తతో సంతోషంగా జీవిస్తున్నానని, ప్రస్తుతం ఆయనతోనే ఉంటున్నానని ఆమె పేర్కొంది. తమను వేధించవద్దని తన కుటుంబ సభ్యులను కోరింది.
అలాగే తన తండ్రి తనను శారీరకంగా, మానసికంగా వేధించినట్లు నందని ఆరోపించింది. సరైన వైద్యం అందక తాను చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత తన భర్త, అత్తమామలు తనను బాగా చూసుకుంటున్నారని, తనకు సరైన వైద్యం అందిస్తున్నారని చెప్పింది. రెండు లక్షలతో ఇంటి నుంచి పారిపోయినట్లు కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణను ఆమె ఖండించింది. తమ కుటుంబం వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు లేదని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.