లక్నో: ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఒక హోటల్లో బస చేశాడు. ఆమె కోసం చాట్ తెచ్చేందుకు రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ప్రియురాలితో కలిసి భర్త ఉన్నట్లు తెలుసుకున్న అతడి భార్య అక్కడకు చేరుకున్నది. రెండు చాట్లతో వెళ్తున్న అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను చితకబాదింది. (man caught by wife) ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భర్త అజయ్ తన ప్రేయసిని కలుస్తున్నట్లు అతడి భార్య కవిత అనుమానించింది. పుణ్యక్షేత్రమైన బ్రిజ్ఘాట్లోని హోటల్లో ఆమెతో కలిసి అతడు ఉన్నట్లు తెలుసుకున్నది. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్నది.
కాగా, తన ప్రియురాలి కోసం తినే పదార్థమైన ‘చోలే భటూరే’ తెచ్చేందుకు అజయ్ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చాడు. రెండు ప్లేట్లు కొనుగోలు చేసి రూమ్‌కు వెళ్తుండగా భార్య కవిత తన భర్తను పట్టుకున్నది. మరో మహిళతో కలిసి హోటల్లో అతడు బసచేయడంపై నిలదీసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అజయ్‌పై దాడి చేసింది. పనికి వెళ్తున్నానని చెప్పి రోజూ ఉదయం ఇంచి నుంచి బయటకు వెళ్తున్న భర్త, తన ప్రియురాలిని కలుస్తున్నాడని ఆమె ఆరోపించింది.
మరోవైపు భార్య కవిత చేసిన ఆరోపణలను అజయ్ ఖండించాడు. తాను ఏ మహిళతోనూ లేనని, ఇంట్లో మానసిక ఒత్తిడి కారణంగానే బ్రిజ్‌ఘాట్‌కు వచ్చినట్లు చెప్పాడు. అయితే భర్త మాటలను కవిత నమ్మలేదు. అజయ్ ఒంటరిగా ఉంటే, ఆ రెండో ‘చోలే భటూరే’ ప్లేటు ఎవరి కోసమని ఆమె ప్రశ్నించింది. దీంతో అజయ్ ఇరుకునపడ్డాడు.
అయితే ఈ వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అనంతరం అజయ్ తన భార్య కవితతో కలిసి ఇంటికి చేరుకున్నాడు.