మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రిలో తన తల్లికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ఓ కుమారుడు చేసిన పని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి ఆస్పత్రి నుంచి తల్లిని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకుని సుమారు 2 కిలోమీటర్లు తోసుకుంటూ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన భూక్యా బుజ్జి (55) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నది. మంగళవారం అర్ధరాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ ఆమెను మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి కావడంతో ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోయారని రాజ్‌కుమార్ ఆరోపించాడు. తన తల్లి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నా వైద్యం చేయాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని, బెడ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది తనపై దాడి చేశారని కూడా ఆరోపించాడు.
దీంతో చేసేదేమీ లేక తల్లిని అదే వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి సమయంలో సుమారు 2 కిలోమీటర్లు వీల్‌చైర్‌ను తోసుకుంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు నివాసానికి చేరుకున్నాడు.
విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంవో శ్రీధర్ హుటాహుటిన ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి హామీ ఇచ్చిన అనంతరం బుజ్జిని తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లికి వైద్యం అందలేదని కుమారుడు అర్ధరాత్రి ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు వీల్‌చైర్‌లో తీసుకెళ్లిన ఘటన ప్రస్తుతం మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది