బెంగళూరు: రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిపై ఒక ఏనుగు దాడి చేసింది. అతడ్ని తొక్కి చంపింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే ఆ ఏనుగును అడవిలోకి తరిమేందుకు సుమారు వంద మందితో కూడిన ప్రత్యేక బృందాలను అటవీ శాఖ రంగంలోకి దించింది. (Elephant kills man on morning walk) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 28న ఉదయం 5 గంటల సమయంలో బెంగళూరు శివారు ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల నాగరాజ్, ఒక రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఏనుగు ఆయనపై దాడి చేసింది. తన పాదాలతో తొక్కి చంపింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ మంత్రి రామలింగ రెడ్డి వెంటనే రాజరాజేశ్వరి ఆసుపత్రిని సందర్శించారు. మృతుడు నాగరాజ్ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఆ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మానవతా దృక్పథంతో ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. కొత్త రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని మంత్రి అన్నారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు అటవీ శాఖ ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిందని వివరించారు.
మరోవైపు ఒక వ్యక్తిపై దాడి చేసి అతడ్ని చంపిన ఆ ఏనుగు కదలికలను గుర్తించి పట్టుకునేందుకు సుమారు 100 మంది సిబ్బందితో కూడిన మూడు ప్రత్యేక బృందాలు, దుబారే క్యాంప్‌కు చెందిన శిక్షణ పొందిన ఏనుగులను రంగంలోకి దించారు. బన్నేర్‌ఘట్ట అటవీ డివిజన్ దాటి ఆ ఏనుగు మరింత ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అటవీ శాఖ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డ్రోన్లతో నిఘాను పెంచింది.
అయితే బీఎం కావల్ ప్రాంతంలో ఆ ఏనుగును గుర్తించామని అటవీ శాఖ అధికారి చక్రపాణి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలతో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అలాగే బన్నెరఘట్ట అటవీ విభాగం పరిధిని దాటి ఏనుగులు బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కాగా, మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిపై ఏనుగు దాడి చేసి చంపిన సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A 60-year-old man was killed in a suspected elephant attack near Doddabele village in Bengaluru. Nagaraju was on his morning walk around 5 am when the elephant attacked him.
He was rushed to hospital with severe injuries but later died. #Bengaluru #elephant pic.twitter.com/Q4b9MksHTQ
— The New Indian Express (@NewIndianXpress) September 28, 2026