Maremma | మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన ‘మారెమ్మ’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. రూరల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వేదికలపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ‘మారెమ్మ’ సినిమా ఒక్క ఓటీటీకే పరిమితం కాకుండా రెండు ప్రముఖ డిజిటల్ వేదికల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగు ఓటీటీ వేదిక ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 9 నుంచి రెండు వేదికల్లోనూ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మారెమ్మ’ను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమైన ‘మారెమ్మ’పై రవితేజ అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది. అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ విడుదల నేపథ్యంలో సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
‘మారెమ్మ’కు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించారు. మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మాధవ్ భూపతిరాజు సరసన దీపా బాలు కథానాయికగా నటించగా, వికాస్ వశిష్ఠ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. వినోద్ కుమార్, వీఎస్ రూప లక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి, విప్రదీప్ దత్తా సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలోని కథతో తెరకెక్కిన ‘మారెమ్మ’ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ.. ఇప్పుడు రెండు ఓటీటీ వేదికల్లో విడుదల కానుండటంతో డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.