Akhilesh Yadav | మాతో చాలా మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, అయితే వారికి చోటు కల్పించడంలో ఇబ్బంది ఉందని పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలలో తమ పార్టీ ఏ మిత్రపక్షాలతో పోటీ చేసిందో, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కూడా దాదాపు అవే మిత్రపక్షాలతో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
త్వరలోనే పొత్తును ప్రకటించడమే తమ లక్ష్యమన్నారు. కూటమి గతంలో ఉన్న విధంగానే కొనసాగుతుందన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కూటమి ఏర్పాటుపై సమాజ్వాదీ పార్టీ , కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. రామమందిర విరాళాల చోరీ ఘటనపై కూడా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీని విమర్శించారు. విరాళాల చోరీల ద్వారా భారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఘాటుగా స్పందించారు. తాము ఎస్పీకే షాక్ ఇవ్వబోతున్నామని, ఎస్పీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్నారని మౌర్య ఎదురుదాడికి దిగారు