హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : మూడేండ్లుగా పత్తాలేని పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. రెండో పీఆర్సీ సాధనకు సమరశంఖాన్ని పూరించారు. సెప్టెంబర్ 10లోగా రెండో పీఆర్సీ ప్రకటించాలని సర్కార్‌కు అల్టిమేటం జారీచేశారు. పీఆర్సీ కమిటీ నుంచి తక్షణమే నివేదిక తెప్పించుకుని.. సెప్టెంబర్ 10లోపు మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే సెప్టెంబర్ 10న లక్షలాది మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కదం తొక్కుతామని.. ఉద్యోగు ల సత్తా చూపుతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవో భవన్లో ఎంప్లాయీస్ జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో సర్కార్ వహిస్తున్న అలసత్వాన్ని సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్రంగా నిరసించారు.
భేటీ అనంతరం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏ శ్రీనివాసరావు మూడు దశల ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మొదటి దశలో ఈ నెల 27న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, రెండో విడతలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినోత్సవం పేరిట నిరసనలు, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్‌కు జేఏసీ పిలుపు ఇచ్చింది. పీఆర్సీ సాధనలో రాజీపడబోమని.. ఉద్యమంతోనే పరిష్కరించుకుంటామని తేల్చిచెప్పారు. ఉద్యోగుల 64 డిమాండ్ల పరిషారంపై సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సబ్ కమిటీ, అధికారుల కమిటీలు అనేక హామీలిచ్చారని, వీటిలో కొన్నింటి ఊసేలేదని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో జేఏసీ నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి, ముజీబ్ హుస్సేనీ, బీ శ్యామ్, సీహెచ్ రవి, వంగ రవీందర్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, మధుసూదన్‌రెడ్డి, స్థితప్రజ్ఞ, రామారావు, నోరి శ్రీనేష్‌కుమార్, కృష్ణాయాదవ్, భిక్షంగౌడ్, ఉమాదేవి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.