హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): గురుకులంలో ఓ కామపిశాచి అకృత్యాలపై అక్కడ పనిచేసే 70 మంది బోధనా సిబ్బంది రాష్ట్ర సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో 2 వేల మంది విద్యార్థినుల భద్రత గాల్లోదీపంలా కొట్టుమిట్టాడుతున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెర్లపటేల్ గూడెంలోని రాజమహేంద్ర ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్‌లో ఫూలే బీసీ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంగణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6 కళాశాలలు, 2 పాఠశాలలు కలిపి మొత్తం 8 విద్యా విభాగాలను నిర్వహిస్తున్నారు.
2,000 మంది విద్యార్థినులు, 70 మంది మహిళా అధ్యాపకులు, ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ‘కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కింద ఎంపికైన విద్యార్థినులు చదువుకుంటుండటం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర, వరర్లు, వాచ్మెన్ సహా మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉన్నది. నిబంధనలను తుంగలో తొకుతూ గురుకులం ఉన్నతాధికారిణి.. తనకు అనుకూలంగా ఉండే పురుష వ్యక్తిని ఔట్సోర్సింగ్ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీటీపీ)గా నియమించారు. వేరే కళాశాల నుంచి ప్రత్యేకంగా
ఆ అధికారిణి చొరవతోనే అతడిని ఇకడికి రప్పించినట్టు ఆరోపణలూ ఉన్నాయి.
చర్లపటేల్గూడెం గురుకులంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులను అక్కడ పనిచేస్తున్న డీటీపీ ఆపరేటర్ అనుచితంగా తాకుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆదివారాలు, సెలవు దినాల్లో విద్యాలయానికి వస్తూ రాత్రి 8 గంటల వరకు క్యాంపస్‌లోనే తిష్ట వేస్తున్నాడని, కంప్యూటర్ పనులు చేయకుండా వేధింపులకు పాల్పడుతున్నాడని ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
రెండేండ్లుగా ఈ దురాగతాలు కొనసాగుతుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ఈ వేధింపులు భరించలేక పలువురు విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు, లెక్చరర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల మానసిక వ్యథను పట్టించుకోవాల్సిన ఆ కీలక అధికారి.. నిందితుడికి కొమ్ముకాస్తూ ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సదరు ఉన్నతాధికారిణి ఆపరేటర్ చెప్పినట్టే వింటున్నారని, ఉపాధ్యాయులు, సిబ్బందిని టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.
విద్యార్థినులు ఇచ్చిన లేఖలను ఆ ఉన్నతాధికారిణి తగులబెట్టి, ఫోన్లలోని ఆధారాలను సైతం తొలగించినట్టు బాధితులు చెప్తున్నారు. లేఖలు రాసిన బాలికలపై ఆమె నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. బాధితులైన విద్యార్థినులతోనే కామాంధుడి కాళ్లు మొకించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. బాధితులకు న్యాయం చేయాల్సిన సదరు ఉన్నతాధికారిణే నిందితుడి తరఫున ఒక డిఫెండర్‌గా మారడం తీవ్ర విస్మయం కలిగిస్తున్నది.
ఆపరేటర్ అకృత్యాలపై, ఉన్నతాధికారి ఆగడాలపై క్యాంపస్‌లోని లెక్చరర్లు, ఉపాధ్యాయులు విద్యాసంస్థల సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. క్యాంపస్‌లో నిధుల దుర్వినియోగం, నిర్వహణ లోపాలు, అనేక పాలనాపరమైన అవకతవకలకు ఆ కీలక అధికారి కేంద్రబిందువుగా మారారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆవరణలో పాములు, తేళ్ల సంచారంతో విద్యార్థులను భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
చర్లపటేల్ గూడెం బీసీ గురుకుల క్యాంపస్‌లో జరుగుతున్న అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్, విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,
సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థినుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధించిన డీటీపీ ఆపరేటర్‌పై పోక్సో సహా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అతనికి సహకరిస్తూ విద్యార్థినులను వేధించిన సదరు ఉన్నతాధికారిణిని తక్షణమే విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.