అందోల్, ఆగస్టు 18 : కరెంట్ కోతలపై కర్షకులు కన్నెర్ర చేశారు. కొద్దిరోజులుగా తరచూ కరెంట్ కోతలు విధిస్తుండటంపై ఆగ్రహించిన సంగారెడ్డి జిల్లా జోగిపేట, మసాన్‌పల్లి రైతులు మంగళవారం అన్నాసాగర్ సబ్‌స్టేషన్ ఎదుట జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు సీఎం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామైంది.
జోగిపేట సీఐ అనిల్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ అక్కడికి చేరుకుని రోడ్డుపై నుంచి పక్కకు పంపించారు. అయినా శాంతించని రైతులు అన్నాసాగర్ సబ్‌స్టేషన్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జోగిపేట డీఈఈ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.