Rivan | బిగ్ బాస్ జోడీగా, సోషల్ మీడియాలో పాపులర్ పెయిర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి, డీమోన్ పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన సుదీర్ఘమైన భావోద్వేగ ప్రకటనతో అసలు విషయాన్ని వెల్లడించాడు. రీతూ చౌదరి, పవన్ మధ్య ఉన్న స్నేహబంధం పూర్తిగా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశాడు. గత కొన్ని నెలలుగా తమ మధ్య వ్యక్తిగత సమస్యలు, తీవ్రమైన గొడవలు చోటుచేసుకున్నాయని పవన్ పేర్కొన్నాడు. పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారడంతో ఇద్దరూ తమ మనశ్శాంతి కోసం విడివిడిగా ప్రాజెక్టులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
తమ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్, ఫేక్ రూమర్స్‌పై పవన్ స్పందించాడు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకులకు కనిపించిన బంధాన్ని, బయట తమ నిజ జీవిత సంబంధాన్ని ఒకే విధంగా చూడకూడదని చెప్పాడు.తమ మధ్య ఉన్నది కేవలం పరస్పర స్నేహబంధమేనని, ఎవరు ఎవరినీ ఉపయోగించుకోలేదని పవన్ స్పష్టం చేశాడు. తమ గురించి తెలియకుండా చేసే ఊహాగానాలు, కామెంట్లు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చాడు.రీతూ, పవన్ మధ్య దూరం పెరిగిన విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా స్పష్టం చేస్తున్నాయి. రీతూ తనను వాట్సాప్, స్నాప్‌చాట్‌లో బ్లాక్ చేసిందని పవన్ తెలిపాడు. అనంతరం తాను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను తొలగించానని, ఆ తర్వాత రీతూ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్లాక్ చేసిందని వెల్లడించాడు.
అయితే గతంలో ఇద్దరూ కలిసి చేసిన పాత పోస్టులను తాను డిలీట్ చేయలేదని పవన్ స్పష్టత ఇచ్చాడు. ఈ విషయంపై కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీతూ చౌదరి, డీమోన్ పవన్ కలిసి కనిపించినప్పుడు అభిమానులు ప్రేమగా ‘రివాన్’ అంటూ పిలుచుకునే ఈ జోడీకి ఇప్పుడు బ్రేక్ పడినట్టే. ఇకపై ‘రివాన్’ అనే కాంబినేషన్ ఉండదని పవన్ తన ప్రకటనలో తేల్చి చెప్పాడు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీరి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన అభిమానులు కూడా ఏర్పడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం ముగిసిందన్న వార్త అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. తమ వ్యక్తిగత విషయాలను మరింత చర్చగా మార్చకుండా నెటిజన్లు అర్థం చేసుకోవాలని పవన్ కోరాడు. అనవసరమైన ఊహాగానాలు, రూమర్స్ చేయకుండా తమకు కొంత ప్రశాంతతను ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.