Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 23వ రోజు నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కింది. ఇప్పటికే హౌస్‌లో కెప్టెన్సీ విషయంలో అపూర్వ, ముకేశ్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతుండగా.. నామినేషన్స్ సమయంలోనూ వీరిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. కెప్టెన్‌గా అపూర్వ తీసుకుంటున్న నిర్ణయాలను ముకేశ్ ప్రశ్నించడం, దానికి అపూర్వ తనదైన శైలిలో సమాధానం ఇవ్వడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా అపూర్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె విధించే కొన్ని రూల్స్‌పై ముకేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వర్షిణి కెప్టెన్ సింహాసనంలో కూర్చోవడాన్ని కూడా ముకేశ్ ప్రశ్నించాడు. కెప్టెన్ సీటులో ఎవరూ కూర్చోకూడదనే నిబంధన ఉన్నప్పుడు వర్షిణికి ఎందుకు అనుమతి ఇచ్చావంటూ అపూర్వను ప్రశ్నించాడు.
దీనికి అపూర్వ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. వర్షిణిని అక్కడ కూర్చోనివ్వడం తన ఇష్టమని స్పష్టం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మరోసారి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. నామినేషన్స్ ప్రక్రియలో కూడా వీరిద్దరి మధ్య ఈ తరహా సిల్లీ గొడవలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. నామినేషన్స్‌కు ముందు బిగ్ బాస్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. గతంలో జరిగిన రథం టాస్క్‌లో టీమ్ భైరవ విజయం సాధించడంతో ఆ జట్టుకు ప్రత్యేక అడ్వాంటేజ్ లభించింది. టీమ్ భైరవలో ఉన్న ప్రతి సభ్యుడికి నామినేషన్ చేసే అవకాశం కల్పించారు. మరోవైపు టాస్క్‌లో ఓడిపోయిన టీమ్ సప్త శక్తికి మాత్రం ఆ అవకాశం పరిమితమైంది. ఆ జట్టులో కేవలం ఇద్దరు సభ్యులకు మాత్రమే నామినేషన్ చేసే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని త్రిగుణ్, నరేష్ తీసుకున్నారు.
దీంతో నామినేషన్స్ ప్రక్రియలో టీమ్ భైరవ సభ్యుల పాత్ర కీలకంగా మారింది. ఒక్కో కంటెస్టెంట్ తమకు నచ్చని ప్రవర్తన, గొడవలు, ఇంట్లో వ్యవహరించే తీరును కారణాలుగా చూపిస్తూ నామినేషన్స్ చేశారు. ఇక నామినేషన్స్‌లో భాగంగా త్రిగుణ్ రోహిత్‌ను టార్గెట్ చేశాడు. రోహిత్‌ను ‘కవరింగ్ స్టార్’ అంటూ త్రిగుణ్ సెటైరికల్ కామెంట్స్ చేశాడు. ప్రతి గొడవకు ఓ కొత్త కథను సిద్ధం చేసుకుని రోహిత్ ముందుకు వస్తాడంటూ తన నామినేషన్‌కు కారణాన్ని వివరించాడు. మరోవైపు ఝాన్సీ.. సృష్టిని నామినేట్ చేసింది. అలాగే ఇంట్లో ప్రతి గొడవకు అమన్ కారణమవుతున్నాడంటూ నరేష్ అతడిని నామినేట్ చేశాడు. రామ్ ప్రసాద్ మాత్రం పదే పదే నోరు జారడం, కోపాన్ని పెంచుకోవడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ షాలినిని నామినేట్ చేశాడు.
23వ రోజు నామినేషన్స్ ప్రక్రియ ముగిసే సమయానికి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు. ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఇక ఈ తొమ్మిది మందిలో ఎవరు ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందుతారు? ఈ వారం ఎవరి ప్రయాణం ముగుస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు హౌస్‌లో అపూర్వ–ముకేశ్ మధ్య కెప్టెన్సీ రూల్స్‌పై కొనసాగుతున్న విభేదాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటాయనేది కూడా ఆసక్తిని పెంచుతోంది.