నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 18 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసే కుట్ర చేస్తున్నదంటూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు ఎన్నికల హామీలో భాగంగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండో రోజైన మంగళవారం
కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు.
పలుచోట్ల బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. పథకాలను కొనసాగించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ సర్కార్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఆడ బిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు వారిలో ఆత్మగౌరవాన్ని నింపేందుకు కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దంటూ నినదించారు. ఈ పథకాలను నీరుగారిస్తే కాంగ్రెస్ సర్కార్‌ను బొందపెడ్తమని హెచ్చరించారు.
కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ వనపర్తిలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిర్వహించిన కదనభేరిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సార్ మళ్లీ రావాలనే పాటకు మహిళలు డాన్స్ చేశారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా
నిర్వహించారు.
కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం సమర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు
ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్, ఇందిరాపార్కు చౌరస్తా మీదుగా ఐవోసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఖమ్మంజిల్లా కల్లూరు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు.
తల్లాడలోనూ ధర్నా నిర్వహించి తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన నిరసనలో ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ముఖ్య నాయకుడు తోట ఆగన్న పాల్గొన్నారు. సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, జీడి భిక్షం పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక రాజగృహ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్, పర్వతగిరి, హసన్‌పర్తి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.

మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు

వనపర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ కదనభేరిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి ధర్నాలో ‘కేసీఆర్ పథకాలు చెరపలేరు.. పేదల మనస్సులోంచి తొలగించలేరు’.. అనే ప్లకార్డుతో వృద్ధురాలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తదితరులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రమిస్తున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పార్టీ నాయకులు

పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడి నిరసన తెలుపుతున్న మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన నిరసనలో మాట్లాడుతున్న ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. చిత్రంలో నాయకులు తోట ఆగయ్య, వీజీ గౌడ్