Tamil Nadu Politics | తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్(CM Vijay)పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడే తీరులో, బాడీ లాంగ్వేజ్‌లో హుందాతనం ఉండాలని, ప్రజలకు మీరే రోల్ మోడల్ అనే విషయాన్ని మరువద్దని ఆయన హితవు పలకారు. ఇటీవల తనను కలిసినప్పుడు తనపై చేసిన విమర్శల గురించి విజయ్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేశారు.
ఎమర్జెన్సీ కాలంలో, మీసా చట్టం కింద కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ నిరసన చేపట్టిన చరిత్రను స్టాలిన్ గుర్తుచేశారు. ఆ సమయంలో డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేశారని, తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వస్తే.. “నా కొడుకు వస్తాడు, వచ్చి అరెస్ట్ చేయండి” అని కరుణానిధి ధైర్యంగా చెప్పారని తెలిపారు. పదేళ్లు ఒకే సెల్లో ఉండి, సరైన వసతులు లేక ఇబ్బందులు పడ్డామని, పోలీసుల చిత్రహింసల కారణంగా తన ప్రాణ స్నేహితుడు చిట్టు బాబు మరణించాడని, తన దవడ పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కేవలం పదవుల కోసం కాకుండా తమిళుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర కలిగిన వారమని స్పష్టం చేశారు. అన్నా కాలం నాటి డీఎంకే చరిత్ర అసెంబ్లీ లైబ్రరీలో రికార్డు అయి ఉందని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే హయాంలో నిర్మించిన వంతెనల వద్ద ఫొటోషూట్లు చేసుకుంటూ, అసెంబ్లీని ‘రీల్స్’ కేంద్రంగా మార్చేశారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రీల్స్‌తో యువతరాని మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పరంజూర్ విమానాశ్రయం రద్దు వల్ల తమిళనాడు అభివృద్ధి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన రూ.2,500 హామీ ఇప్పటికీ రూ.1,000గానే ఉందని, సిలిండర్ల పంపిణీలోనూ కోతలు పెట్టారని, రైతుల రుణ మాఫీ సరిగ్గా జరగలేదని దుయ్యబట్టారు.
మార్పు కోసమే ఓటు వేసిన యువత.. ఇదేనా తాము కోరుకున్న అసలైన మార్పు అని ప్రశ్నించుకోవాలని స్టాలిన్ సూచించారు. ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యంగా ఉండకూడదని, మన సిద్ధాంతం అది కాదని స్పష్టం చేశారు. ఏ నాణేనికైనా రెండు వైపులా ఉన్నట్టే, అధికారంలో ఉన్నా లేకపోయినా తమిళనాడు అభివృద్ధి కోసం మనం నిరంతరం పోరాడుతూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి, అసెంబ్లీలో తమిళుల హక్కులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8
— M.K.Stalin (@mkstalin) September 10, 2026