ముంబై: ఒక ప్రేమ జంట బ్రేకప్ వల్ల పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో పరీక్ష అక్రమాలపై నిరసన చేస్తున్న విద్యార్థులు ఆ జంటకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పోస్టర్లు ప్రదర్శించారు. (Students Thank Ex-Lovers) మార్చి 22న మహారాష్ట్రలోని ఆరు డివిజన్ల పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకం కోసం ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్సీ) నిర్వహించింది. జూన్ 12న ఫలితాలు ప్రకటించగా 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. అయితే పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందే పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక ప్రేమ జంట కారణంగా పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది.
కాగా, తన కుమార్తె రితుజా పాటిల్ కోసం ఆమె తండ్రి అమృత్ పాటిల్, నందుర్బార్కు చెందిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడైన ప్రవీణ్ పాటిల్ నుంచి ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. లీకైన ఆ పేపర్‌ను రితుజ తన ప్రియుడు గౌరవ్ పాటిల్‌కు షేర్ చేసింది. అయితే ఎగ్జామ్ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించగా, గౌరవ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో చివరకు వారు విడిపోయారు.
మరోవైపు రితుజకు ప్రభుత్వ ఉద్యోగం రాగానే తనకంటే ఆమె పురోగతిలో ఉంటుందని గౌరవ్ ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో ఈ పేపర్ లీక్‌పై ఎంపీఎస్సీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి అతడు ప్రయత్నించాడు. అప్పటికే విచారణ ప్రారంభమైంది.
అయితే రితుజ తండ్రి కొనుగోలు చేసిన ఆ ఎగ్జామ్ పేపర్ ప్రవీణ్ పాటిల్‌కు చేరడం వెనుక కొంతమంది ఎంపీఎస్సీ అధికారుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ లీక్ వ్యవహారంలో రూ.12 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు బయటపడటంతో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో
డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్-బి పోస్టుల నియామక ప్రక్రియను ఎంపీఎస్సీ రద్దు చేసింది.
కాగా, పేపర్ లీక్ వ్యవహారంపై మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ లీక్ వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీఎస్సీ ఛైర్మన్ వివేక్ భీమన్వార్, కార్యదర్శి మహేంద్ర హర్పాల్కర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2022 నుంచి జరిగిన అన్ని పరీక్షలపై స్వతంత్ర విచారణ జరపాలని విద్యార్థులు కోరుతున్నారు.
మరోవైపు నాగ్‌పూర్‌లోని సంవిధాన్ చౌక్‌లో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రేమికుల జంట విడిపోవడం వల్లే ఎంపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ లీక్ బయటపడిందని పేర్కొన్నారు. ‘రితుజ, గౌరవ్’కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లను ప్రదర్శించారు. ఆ ప్రేమికుల జంట విడిపోకపోయి ఉంటే పరీక్షల అవకతవకల వెనుక ఉన్న పూర్తి నిజం ఎప్పటికీ వెలుగులోకి వచ్చి ఉండేది కాదని విద్యార్థులు తెలిపారు. వారి బ్రేకప్ వల్లనే ఎగ్జామ్ లీక్‌కు సబంధించిన అనేక చాట్లు, కాల్ రికార్డింగ్‌లు, కీలక వివరాలు బయటకు వచ్చాయని అన్నారు. అందుకే ఆ జంటకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు విద్యార్థులు వివరించారు.