T20 World Cup 2007 : పురుషుల టీ20 ప్రపంచకప్‌ను ఒకటి కాదు ఏకంగా మూడుసార్లు ముద్దాడింది భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. కానీ, అప్పుడప్పుడే పొట్టి క్రికెట్ వైపు అడుగులు పడుతున్న వేళ ‘మెన్ ఇన్ బ్లూ’ తొలిసారి ఈ ఐసీసీ ట్రోఫీని అందుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమే. తొలిసారి నిర్వహించిన ఈ మెగా టోర్నీలో జులపాల ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని టీమిండియా అబ్బురపరిచే ఆటతో కప్‌ను ఒడిసిపట్టింది. అది కూడా ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో పాకిస్థాన్‌ను ఓడించి. టీమిండియా, ధోనీ ఘనతల్లో కలకాలం నిలిచిపోయిన ఈ మొట్టమొదటి పొట్టి వరల్డ్‌కప్ విజయానికి సరిగ్గా నేటితో 26 ఏళ్లు.
క్రికెట్లో ఇప్పుడు టీ20లదే హవా. బ్యాటర్ల వీరకొట్టుడు, ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లర్.. అబ్బో ఈ ఆట ఇచ్చే కిక్కే వేరు. అయితే.. 2007లోనే క్రికెట్ ప్రియులకు అసలు సిసలైన టీ20 మజాను పంచింది టీమిండియా. ఆ ఏడాది ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన పొట్టి వరల్డ్‌కప్‌ను సంచలన ఆటతో లేని ధోనీ సారథ్యంలోని భారత జట్టు గెలుపొందింది. సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చరిత్ర సృష్టించగా.. పాకిస్థాన్‌తో ఫైనల్ మరింత థ్రిల్‌నిచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్లో జోగిందర్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ను, శ్రీశాంత్ పట్టిన సూపర్ క్యాచ్‌ను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
India lifted the inaugural T20 World Cup in Johannesburg #OTD in 2007 🏆 pic.twitter.com/ccRoHNTBE3
— Cricinfo (@cricinfo) September 24, 2026
సెప్టెంబర్ 24న జరిగిన ఫైనల్లో భారత్ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో పాకిస్థాన్ 152కే పరిమితమైంది. సహచరులు విఫలమైనా.. క్రీజునంటుకున్న మిస్బాహుల్ హక్ (43) సిక్సర్లతో విరుచుకుపడి భారత అభిమానుల్లో గుబులు రేపాడు. కానీ, ఒత్తిడికి తలొగ్గే అలవాటున్న పాక్ ధోనీ తెలివి ముందు ఓటమిని తప్పించుకోలేకపోయింది. జోగిందర్ సూపర్ బౌలింగ్.. శ్రీశాంత్ అద్భుత క్యాచ్ తోడయ్యాయి. అంతే.. సులువగా గెలుస్తుందనుకున్న దాయాది జట్టు మిస్బా తప్పుడు షాట్‌తో చతికిలపడింది.
India won the T20i World Cup OTD in 2007 under the leadership of Mahendra Singh Dhoni by beating pakistan in the final. pic.twitter.com/QGb3E278Jl
— Jayprakash MSDian™ (@ms_dhoni_077) September 24, 2026
అంతే.. 1983లో ‘కపిల్ డెవిల్స్’ దేశానికి తొలి వన్డే వరల్డ్‌కప్ గెలుపొందిన రోజున భారతీయులు ఎంతగా సంబురాలు చేసుకున్నారో.. ధోనీ సేన టీ20ల్లో జగజ్జేతగా నిలిచిన రోజున అంతకుమించి సంబురాల్లో గడిపారు. ఫైన్ లెగ్‌లో మిస్బా ఆడిన బంతిని శ్రీశాంత్ అందుకోవడంతో భారత డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్‌కు హర్యానా ప్రభుత్వం పోలీస్ జాబ్ ఇవ్వగా.. ప్రస్తుతం అతడు డీఎస్పీ హోదాలో ఉన్నాడు.