న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్దకు రప్పించుకున్నాడు. మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్ చేసి బాధితురాలిని బెదిరించాడు. ఆ వ్యక్తి వేధింపులు భరించలేని ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Woman Raped On Pretext Of Job) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల మహిళకు, గణేష్ నగర్‌కు చెందిన దీపక్ బన్సాల్ అనే వ్యక్తి రెండేళ్ల కింద పరిచయమయ్యాడు. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేస్తానని అతడు హామీ ఇచ్చాడు.
కాగా, మార్చి 4న ఉద్యోగ విషయమై మాట్లాడాలనే సాకుతో మండావళి ప్రాంతంలో ఆ మహిళను దీపక్ కలిశాడు. ఆ సమయంలో మత్తు పదార్థాన్ని ఆమెకు ఇచ్చాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ మహిళపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను వీడియా రికార్డ్ చేశారు. స్పృహ వచ్చిన తర్వాత ఆ మహిళను బెదిరించాడు. ఆమె బంగారు గాజులు, ఉంగరం, గొలుసు కూడా తీసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. పోలీసు శాఖలో తనకు పరిచయాలు ఉన్నాయని అతడు చెప్పాడు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఆమెపై యాసిడ్ పోస్తానని అతడు బెదిరించాడు.
మరోవైపు భయం కారణంగా ఆ మహిళ కొన్ని నెలల పాటు మౌనంగా ఉన్నది. అయితే దీపక్ నిరంతరం వేధించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధిత మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు.