‘బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి?’ ఇది తెలంగాణ కాంగ్రెస్ నినాదం. కానీ, తెలంగాణ సమాజం ఏమనుకుంటున్నది? సోషల్ మీడియాలో ప్రజలు ఏమంటున్నరు? వందరోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తానని సకల దేవతల సాక్షిగా, పార్టీ ప్రమాణ పత్రం సాక్షిగా వాగ్దానం చేసి, ప్రమాణ భంగం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అని కాంగ్రెస్ నేతలు నాలుక కర్చుకున్నారు. ఇందిరాపార్క్ వద్ద కేసీఆర్ రాజీనామా డిమాండ్‌తో ఇచ్చిన రాజకీయ నినాదం రివర్స్ అయింది. తెలంగాణ సాధించిన ఉద్యమ నేతను, ప్రతిపక్ష నాయకుడి స్థానం నుంచి దించడమే కాంగ్రెస్ లక్ష్యమా? లేదా ఆయన కంటే మెరుగైన పాలనతో ప్రజల మనసులు గెలుచుకోవడమా?
రాజకీయాల్లో కొన్ని నినాదాలు సభా ప్రాంగణాన్ని దాటి ప్రజల్లోకి వెళ్లిన తర్వాత వాటి అర్థాన్నే మార్చుకుంటాయి. ఒక్కోసారి ఒక పార్టీ విసిరిన రాజకీయ అస్త్రం, ప్రజల చేతుల్లోకి వెళ్లి అదే పార్టీ వైపునకు తిరిగి వస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని ఆరోపిస్తూ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేసింది. కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కానీ ఆ నినాదం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత వినిపించిన ప్రశ్న మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి? అని ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న అక్కడితో ఆగలేదు. హామీలను అమలు చేయని రేవంత్ ఎందుకు రాజీనామా చేయకూడదు? అనే దిశగా మలుపు తిరిగింది.
కేసీఆర్‌ను ఇప్పుడు రాజీనామా చేయమని అడుగుతున్నవారు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. రాజీనామా అనే పదం కేసీఆర్‌కు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో పదవులను తృణప్రాయంగా వదిలిన చరిత్ర కేసీఆర్‌ది. 2006లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఇచ్చిన హామీ అమలు కావడం లేదని నిరసిస్తూ కేసీఆర్ కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికలో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందడం తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగా కీలక ఘట్టంగా మారింది.
2008లోనూ తెలంగాణ అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రలో రాజీనామా అంటే భయపడే పదం కాదు. ప్రజల ముందుకు వెళ్లి ప్రజా తీర్పును సవాల్‌గా స్వీకరించే రాజకీయ ఆయుధం. అందుకే ఇప్పుడు కేసీఆర్‌కు రాజీనామా అంటే ఏమిటో కాంగ్రెస్ నేతలు రాజకీయ పాఠం చెప్పడం విచిత్రంగానే కనిపిస్తున్నది.
కేసీఆర్ విలువను కేవలం ఆయన ప్రస్తుతం అసెంబ్లీకి వస్తున్నారా? లేదా, సచివాలయంలో ఉన్నారా?, ఫామ్‌హౌస్‌లో ఉన్నారా? అనే భౌతిక ప్రశ్నలతో కొలువడం సాధ్యం కాదు. ఎందుకంటే కేసీఆర్ అనే రాజకీయ శిఖరం ఒక పదవికి పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక దీర్ఘ రాజకీయ ప్రయాణం. ఆ ప్రయాణానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అదే నాయకుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపారు. కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని వాగ్దానాలు నమ్మి 2023లో ప్రజలు అధికారాన్ని మార్చారు. ఎవరికైనా తీర్పు చెప్పేది, పదవి ఇచ్చేది ప్రజలే. కాబట్టి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుపై తుది తీర్పు కాంగ్రెస్‌ది కాదు, రేవంత్‌రెడ్డిది అంతకన్నా కాదు, తెలంగాణ ప్రజలది. అదే ప్రజలు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజల మాటల్లో, పాటల్లో, సభల్లో ఇదే ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. ఒక నాయకుడి బలం పదవిలో ఉండదు. ప్రజల జ్ఞాపకం, విశ్వాసం, ఆకాంక్షలో ఉంటుంది.
కేసీఆర్‌కు చట్టబద్ధంగా లభించే జీతభత్యాలు, భద్రత వంటి అంశాల గురించి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రభుత్వ వనరుల వినియోగంపై గురించి ఆలోచించాలి. ప్రభుత్వ వనరులు ఎవరికి, ఏ హోదాలో, ఏ కారణంతో వినియోగిస్తున్నారో ప్రజలకు స్పష్టమైన లెక్క చెప్పాలి. ముఖ్యమంత్రి సోదరులు, కుటుంబ సభ్యులకు కల్పించే భద్రత, ఎస్కార్టు, ఇతర ప్రభుత్వ సౌకర్యాల విషయంలోనూ పారదర్శకత ఉండాలి. ప్రజాధనం ఎవరి కోసం ఖర్చయినా ప్రజలకు లెక్క చెప్పాలి కదా! ముఖ్యంగా ప్రజాప్రతినిధి సభకు హాజరు కావడం అనేది ప్రాథమిక విధి కాదు. తన విధుల్లో ఓ భాగం మాత్రమే.
కాంగ్రెస్ నేతలు నియమ నిబంధనలు తెలుసుకోవాలి. గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు కూడా సభ ను బహిష్కరించిన సంగతిని గుర్తుచేసుకోవాలి. ఇక కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించడం ఒక రాజకీయ ప్రశ్న. అయితే అదే సమయంలో అధికారంలో పార్టీ తన ఎన్నికల వాగ్దానాలకు సమాధానం చెప్పాలి. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీల పరిస్థితి ఏమిటి? ఆరు గ్యారెంటీల అమలు ఎంతవరకు వచ్చింది? యువతకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? రైతుకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకూ పాలకులు లెక్క చెప్పాల్సిన అవసరం లేదా? అందుకే కేసీఆర్ రాజీనామా చేయాలి అనే నినాదం కాస్త కాంగ్రెస్‌కు బూమరాంగ్ అయింది. ‘మీరు ఇచ్చిన హామీల సంగతేంది?’ అని ప్రజానీకం వివిధ వేదికలపై నిలదీస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో అసలు పోటీ అంటే ఎవ రు రాజీనామా చేశారు? అనేది కాదు. ఎవరు ప్రజలకు మెరుగైన పాలన అందించారు? అనేదే. కేసీఆర్ ఇప్పటికే ఒకసారి కాదు, ఎన్నోసార్లు పదవులను పక్కనపెట్టి ప్రజల ముందు కు వెళ్లిన నాయకుడు. అందుకే ఆయనను ఎదుర్కోవాలనుకునేవారు ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది ప్రశ్న కాదు. కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత జరిగే ఎన్నికలో ఆ స్థానంలో నిలబడి ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం ఎవరికున్నది?