H-1B visa : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఏడాదిలోగా అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా (H-1B visa) విధానంలో భారీ మార్పులు రానున్నాయి. విదేశీ కార్మిక వీసాల విషయంలో జరుగుతున్న మోసాలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం గత కొంతకాలంగా ఉక్కుపాదం మోపుతున్నది. ఈ క్రమంలో ఈ మార్పులు అనివార్యమని తెలుస్తున్నది. ఈ మేరకు అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో స్వయంగా వెల్లడించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆంథోనీ.. రాబోయే 365 రోజుల్లో విదేశీ కార్మిక వీసా కార్యక్రమంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయని చెప్పారు. అరెస్టులకు తాము సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలను అమెరికా ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలనుబట్టి హెచ్-1బీ వీసా మోసాలపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో తెలుస్తున్నది.
నకిలీ వీసా దరఖాస్తులు, వేతనాల్లో అవకతవకలు, కార్మికుల దోపిడీ, అమెరికన్ ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలపై అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ చర్యలు ప్రభుత్వ విస్తృత వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. ఇప్పటికే కొంతమంది హెచ్-1బీ వర్కర్ల ప్రవేశంపై ఆంక్షలను పొడిగించిన ప్రభుత్వం.. వీసా దరఖాస్తులను సమీక్షించేటప్పుడు కంపెనీలు గతంలో ఉద్యోగులను తొలగించిన చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏజెన్సీలను ఆదేశించింది.
స్థానిక టెక్ ఉద్యోగాలను విదేశీ నిపుణులతో భర్తీ చేయకుండా నిరోధించేందుకు గతంలో ‘ప్రాజెక్ట్ ఫైర్వాల్’ వంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు. కొన్ని కంపెనీలు, ఔట్సోర్సింగ్ సంస్థలు అమెరికన్ల వేతనాలను, ఉద్యోగాలను దెబ్బతీసేందుకు హెచ్-1బీ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శకులు అంటుండగా.. దేశంలో నిపుణుల కొరతను తీర్చడానికి ఈ వీసా ఎంతో అవసరమని దాని మద్దతుదారులు వాదిస్తున్నారు.