బ్యాలెట్ అంటే బీజేపీకి భయమెందుకు?!
ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి... నచ్చిన ఓటరుతో ఓటు వేయించుకోవడం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రజాస్వామ్య విధానం. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్' ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ఈ కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నది. ప్రజలు ఎంచుకున్న పార్టీలు అధికారంలోకి రావడం కాకుండా... పార్టీలు ఎంచుకున్న పౌరులు మాత్రమే ఓటు వేసే వ్యవస్థను బీజేపీ తీర్చిదిద్దుతున్నది.
- దేశమంతా వద్దంటున్నా.. పార్టీలన్నీ కాదంటున్నా.. పట్టుబడుతున్న బీజేపీ
- ఈవీఎంలను తిరస్కరించిన 30 దేశాలు.. వాడుతున్నది భారత్ ఒక్కటే
- చేతిలో ఈసీ, దన్నుగా సర్, అండగా ఈవీఎంలు…ఇదీ కమల్ కా కమాల్!
- నిపుణుల మాటా బేఖాతరు.. అదేమంటే దేశభక్తి నినాదాలు, తిరంగా ర్యాలీలు
ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి… నచ్చిన ఓటరుతో ఓటు వేయించుకోవడం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రజాస్వామ్య విధానం. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ఈ కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నది. ప్రజలు ఎంచుకున్న పార్టీలు అధికారంలోకి రావడం కాకుండా… పార్టీలు ఎంచుకున్న పౌరులు మాత్రమే ఓటు వేసే వ్యవస్థను బీజేపీ తీర్చిదిద్దుతున్నది.
ప్రజలు తమకు నచ్చిన పార్టీకి స్వేచ్ఛాయుతంగా ఓటేయడమే అసలైన ప్రజాస్వామిక విధానం. అలాంటి వాతావరణాన్ని చంపేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే!
బ్యాలెట్ అంటే బీజేపీ ఎందుకు భయపడుతున్నది? ప్రపంచమంతా తిరస్కరించిన ఈవీఎంలను తానెందుకు తలకెత్తుకుంటున్నది?ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే ఏదైనా ఓకే అని ఎందుకు అనలేకపోతున్నది?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ల వడపోత మొదలైనప్పటినుంచీ దేశ ప్రజల మదిలో మెదులుతున్న పలు సందేహాలివి. అగ్రరాజ్యం అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంను ఎప్పుడో తిరస్కరించాయి. ఆధునిక ప్రపంచం బ్యాలెట్‌నే విశ్వసిస్తున్నది. మనదేశంలోనూ దశాబ్దాల తరబడి పోలింగ్ వాటి ద్వారానే జరిగింది. భారత్‌లో ఓటింగ్ యంత్రాలపై రెండు దశాబ్దాలుగా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈసీ కూడా సందేహాల నివృత్తిని ఎప్పుడో వదిలేసింది.
‘సర్’ తర్వాత దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను కోరుతున్నాయి. కానీ ఈసీ, దాన్ని కాపుగాస్తున్న బీజేపీ మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు?అండగా ఈసీ, అదనుగా సర్, ఆపై ఈవీఎం.. ఇదే ఫార్ములా కాపాడుతుందని బీజేపీ నమ్ముతున్నదా? ఈవీఎంలు లేకుంటే గెలుపు బుడగ పేలిపోతుందని భయపడుతున్నదా? ఈసీ, బీజేపీ కవల సోదరుల్లా వహరిస్తున్నాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా ఒకరికొకరు అంటకాగుతున్నాయి. ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటున్నాయి.ఈసీ సర్క్స్.. బీజేపీ రింగ్ మాస్టర్!
హనుమకొండ, నవంబరు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం. ప్రజలు నచ్చిన పార్టీని ఎంపిక చేసుకునే ఏకైక మార్గం ఎన్నికలు. అలాంటి కీలకమైన ఎన్నికల నిర్వహణ వ్యవస్థ దేశంలో అన్నింటి కంటే పారదర్శకంగా ఉండాలి. అయితే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా మారిపోయింది. ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలంటే అక్కడ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ (అందరికీ పారదర్శకమైన సమాన అవకాశాలు) అనేది ఉండాలి. స్వేచ్ఛాయుతంగా ఎన్నుకొనే వాతావరణం కల్పించాలి.
కానీ, బీజేపీ ఇప్పుడు అలాంటి ఎన్నుకొనే వాతావరణం ప్రజలకు లేకుండా చేస్తున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసీని చెప్పుచేతల్లో పెట్టుకోవడం, ఈసీ నిర్వహించే కార్యక్రమాలను తనకు అనువుగా మార్చుకోవడం ద్వారా బీజేపీ తనకు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల ఫలితాలను మారుస్తున్నదని విమర్శలు ఉన్నాయి. అంతే కాదు, తన ఎత్తుగడకు ఎక్కడా ఆటంకాలు రాకుండా న్యాయవ్యవస్థను కూడా అది ప్రభావితం చేస్తున్నదన్నదనే అనుమానాలు వినిపిస్తున్నాయి. సర్ ప్రక్రియను దుర్వినియోగం చేయడం ద్వారా లక్షిత ఓట్లను తొలగించి, అనుకూలుర ఓట్లను జోడించి బీజేపీ గెలుపు మార్గాన్ని ఎంచుకొంటున్నట్టు ఆరోపణలు ఒకవైపు వ్యక్తమవుతుండగా మరోవైపు బీజేపీ ఈవీఎంలను కూడా తన గెలుపు సాధనాలుగా మార్చుకున్నదనే అభియోగాలు పుంఖాను పుంఖాలుగా వినిపిస్తున్నాయి.
అధికారంలోకి రాకముందు ఈవీఎంలను వ్యతిరేకించిన బీజేపీ నేతలే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఈవీఎంలే ఉండాలని పట్టుబడుతుండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నది. దేశంలోని చిన్నా, పెద్దా రాజకీయ పార్టీలన్నీ ఈవీఎంలు వద్దే వద్దని మళ్లీ బ్యాలెట్ ఎన్నికలకే మళ్లుదామని డిమాండ్ చేస్తుంటే ఒక్క బీజేపీ మాత్రం ఈవీఎంలే ఉండాలని వాదిస్తున్నది. దానికి ఈసీ వంతపాడుతున్నది. ఈ క్రమంలోనే బ్యాలెట్ అంటే బీజేపీకి ఎందుకు భయం అనే ప్రశ్న తలెత్తుతున్నది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లతో ఫలితాన్ని మార్చుకునేందుకు బీజేపీ ప్రభుత్వానికి ఈసీ పూర్తిగా సహకరిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసీపై ఆరోపణలు, విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ఈసీ ఎన్నికలు నిర్వహించడానికి వాడుతున్న ఈవీఎంలపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలను బలపర్చే విధంగా.. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఎక్కడా పొంతన కుదరకపోవడం, గతంలో గెలిచిన చరిత్ర కూడా లేని సీట్లను బీజేపీ గెలుచుకోవడం, బీజేపీ ఓడిపోతుందని సెఫాలజిస్టులు అంచనా వేసిన స్థానాల్లో ఆపార్టీ గెలువడం, సెఫాలజిస్టుల అంచనాలు విపక్షాల విషయంలో నిజమవుతూ.. బీజేపీ విషయంలో నిజంకాకపోవడం, ఎన్నడూచూడని విధంగా అసాధారణంగా పోలింగ్ శాతం నమోదవ్వడం, పోలైన ఓట్లకు సంబంధించి ఈసీ ఎప్పటికప్పుడూ సమాచారం వెలువరించకుండా జాప్యం చేయడం ఇవన్నీ అనుమానాలను పెంచుతున్నాయి.
అన్నింటికంటే ఎక్కువగా దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈవీఎంలు వద్దని, మళ్లీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించుకొందామని పట్టుబడుతుంటే, ఒక్క బీజేపీ మాత్రమే ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామని భీష్మించుకొని కూర్చొంటున్నది. ఈ మేరకు కేంద్రం తరుఫున సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయిస్తున్నది. ఇక్కడే, బ్యాలెట్ అంటే బీజేపీకి భయమెందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
హ్యాకింగ్ భయాలతో అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలను కాదని బ్యాలెట్ విధానంలోనే ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నది. అయితే, బ్యాలెట్‌ను కాదని బీజేపీ ఈవీఎంలకే మద్దతు ప్రకటిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు మొదలు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల వరకూ ఇప్పటికీ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నది. అయితే, వివిధ రాష్ర్టాల్లో అధికారాన్ని నిర్ణయించే అసెంబ్లీ, కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వాడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాలెట్‌తోనే ఎన్నికల చరిత్ర షురూ..
స్వతంత్య్ర భారత దేశంలో 1951-52లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల నుంచి 1999 లోక్‌సభ ఎన్నికల వరకూ బ్యాలెట్ విధానంలోనే ఎలక్షన్లు జరిగాయి. అయితే, 2004లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల సాయంతో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించారు. సుమారు ఐదు దశాబ్దాలపాటు బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికలపై ఎప్పుడూ పెద్దయెత్తున అభ్యంతరాలు, అనుమానాలు, ఫిర్యాదులు దాఖలు కాలేదు. ఎప్పుడైతే, ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ మొదలయ్యిందో ఫిర్యాదులు పెరగడం ప్రారంభమైంది. ముఖ్యంగా 2014 సాధారణ ఎన్నికల తర్వాత ఈవీఎంల విశ్వసనీయత, ఓటింగ్ పారదర్శకతపై ఫిర్యాదులు అమాంతం పెరగడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. మన దేశంలో ఈవీఎంల ద్వారా.. వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లోనూ పోలైన ఓట్ల కంటే ఫలితాల రోజు వెల్లడించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం నిత్యకృత్యంగా తయారయ్యింది. గడిచిన పుష్కరకాలంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఓట్ల సంఖ్య విషయంలో ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వడంలేదు. పోలింగ్ రోజు సాయంత్రం అధికారులు ఓట్ల సంఖ్యను స్పష్టంగా చెప్పడం 12 ఏండ్ల కిందటే ఆగిపోయింది. ఫలితాల వెల్లడి రోజు చెప్పే లెక్కలే ఫైనల్ అన్నట్లుగా ఇప్పుడు వ్యవస్థ తయారయ్యింది. దీంతో ఈవీఎంల మీద అనుమానాలు మరింతగా పెరుగడం ప్రారంభమయ్యింది.
ఈవీఎంలను వద్దనుకొన్న దేశాలు
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, సాంకేతికతకు అడ్డాగా చెప్పుకొనే ఎన్నెన్నో దేశాలు ఈవీఎంల వాడకానికి స్వస్తి పలికాయి. ఇప్పటివరకూ 31 దేశాలు ఈవీఎంలను వాడాయి. వాటిలో 30 దేశాలు వాటికి గుడ్‌బై చెప్పగా, భారత్ మాత్రమే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తిస్థాయిలో ఈవీఎంలను వినియోగిస్తున్నది. అతి పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, యూకే, కెనడా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఐర్లాండ్, దక్షిణ కొరియా, స్కాట్లాండ్, ఫిన్లాండ్, బెల్జియం, సింగపూర్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈవీఎంల వినియోగంపై వెనక్కి తగ్గాయి. హ్యాకింగ్, ట్యాంపరింగ్, విశ్వసనీయ సమస్యలే దీనికి కారణంగా పేర్కొన్నాయి.
గతంలో ఈవీఎంలపై బీజేపీ గుస్సా
అధికారంలోకి రాక ముందు గత కాంగ్రెస్ హయాంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దయెత్తున ఉద్యమాలు చేసింది. ‘కెన్ వుయ్ ట్రస్ట్ అవర్ ఈవీఎం’ పేరిట బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఓ పుస్తకాన్నే రాశారు. బీజేపీ సీనియర్లు అద్వానీ, నితిన్ గడ్కరీ, అరుణ్‌జైట్లీ తదితరులు ఈవీఎంలను తప్పుబడుతూ గతంలో పెద్దయెత్తున ప్రచారం నిర్వహించారు. అయితే, మోదీ అధికారంలోకి వచ్చినతర్వాత బీజేపీ నాయకులకు గతంలో తప్పుగా కనిపించిన ఈవీఎంలు.. ఇప్పుడు ఒప్పుగా కనిపించడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
స్థానిక ఎన్నికలు బ్యాలెట్‌తోనే..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌తో రాని సమస్య లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలా వస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ర్టాల్లో అధికారాన్ని చేపట్టడానికి అసెంబ్లీ ఎన్నికలు, కేంద్రంలో అధికారాన్ని చేపట్టడానికి లోక్‌సభ ఎన్నికలు కీలకం కాబట్టే, బ్యాలట్‌ను కాదని ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవీఎంల వాడకానికి బీజేపీ పట్టుబడుతున్నదని విమర్శిస్తున్నారు.
నా ఓటు ఎవరికి పడింది??
బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికల నిర్వహణ కొనసాగినప్పుడు.. ఓటరుకు తాను ఏ పార్టీకి ఓటేశానన్న విషయం స్పష్టంగా తెలిసేది. అయితే ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియను తీసుకొచ్చినప్పటి నుంచి తమ ఓటు ఏ పార్టీకి వేశామో తెలియడంలేదని మెజార్టీ ఓటర్లు అయోమయంలో ఉన్నారు. ఈవీఎంలో మీట నొక్కిన తర్వాత పక్కనే ఉన్న వీవీప్యాట్ బాక్స్‌లో ఓటేసిన పార్టీ గుర్తు కనిపిస్తుందని ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ, చాలా పోలింగ్ బూత్‌లలో వీవీప్యాట్ సమస్య ఎదురవుతున్నది. యూపీ (2022), ఢిల్లీ (2019), కేరళ (20 24)లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూసినట్టు బాధితులు చెప్తున్నారు.
బ్యాలెట్ వద్దంటున్నది అందుకేనా?
బ్యాలెట్ విధానంలో ప్రతికూల ఫలితాలు వస్తుండటంతోనే బీజేపీ ఈవీఎంలకు మద్దతునిస్తూ ప్రచారం చేస్తున్నదా? అని జరుగుతున్న ప్రచారానికి ఇటీవల జరిగిన పరిణామాలు బలాన్ని ఇస్తున్నాయి. రాజస్థాన్‌లో బ్యాలెట్‌తో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు, గత జూన్‌లో ఉత్తరాఖండ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో, గత మేలో పంజాబ్‌లో జరిగిన సివిక్ ఎలక్షన్లలో, గత డిసెంబర్లో కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నది. దీన్నిబట్టి, ఈవీఎంలతో సాధ్యమైన విజయం.. బ్యాలెట్ పేపర్లతో కావడంలేదన్న కారణంతోనే.. బీజేపీ ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వార్తలను ఈమేరకు ఉదహరిస్తున్నారు.
భారత ఈవీఎంలతో బోట్స్వానాకు షాక్
భారత్‌లో తయారు చేసిన ఈవీఎంలపై గతంలో బోట్స్వానా దేశంలో పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్‌లో తయారైన ఈవీఎంలను 2019 ఎన్నికల్లో వినియోగించాలని తొలుత ఆ దేశం భావించింది. ఈ క్రమంలో మాక్ పోలింగ్ నిర్వహించింది. అయితే, అధికార పార్టీకే ఓట్లు అన్నీ పోల్ అవ్వడంతో ఆ దేశం ఈవీఎంల ద్వారా పోలింగ్ జరిపే నిర్ణయాన్ని నిలిపేసింది. బ్యాలెట్ విధానంలోనే ఓటింగ్ నిర్వహించింది. అంతేకాదు, ఈ ఉదంతానికి సంబంధించి భారత్‌పై కోర్టులో కేసు వేసింది.
- మధ్యప్రదేశ్‌లో 2017లో ఉప ఎన్నికల సందర్భంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ఈవీఎంలలో ఏ మీట నొక్కినా.. వెలుపలికి వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులన్నీ బీజేపీ గుర్తువే ఉండటం కలకలం సృష్టించింది.
- ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్తూ ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే ఒకరు.. మే 2017లో ఢిల్లీ అసెంబ్లీలోని ఓ ప్రదర్శన చేసి చూపించారు.
ఈసీకి సూపర్ పవర్స్

2023లో బీజేపీ ప్రభుత్వం అజమాయిషీగా చేసిన చట్టంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు దేశంలో ఏ వ్యవస్థకు లేని సర్వాధికారాలు వచ్చాయి. ఈ అధికారాలతోనే ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభ్వుత్వానికి అనుగుణంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థను మార్చుతున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి, గవర్నర్లకు విశేష అధికారాలు (కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీస్) ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం ఈ మేరకు ప్రత్యేకంగా పేర్కొన్నారు. పదవిలో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లలపై ఎలాంటి విచారణకు అస్కారం ఉండదు.అది కూడా కేవలం పదవిలో ఉన్నంతవరకే.
కానీ బీజేపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు సైతం లేని అత్యున్నత ప్రత్యేక రక్షణలను కేంద్ర ఎన్నికల కమిషనర్లకు కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా 2023లో చట్టం చేసింది. లోక్‌సభలో విపక్షాలు, ఇతర పార్టీలకు చెందిన దాదాపు 146 మంది, రాజ్యసభ్యలో 56 మంది సభ్యులను బయటికి పంపించి మరీ ఎన్నికల కమిషన్ బాధ్యులకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టింది. ఈ పోస్టులో పని చేసిన వారు ఎలాంటి విచారణను ఎదుర్కొనే అవకాశం లేకుండా ఈ చట్టంలో నిబంధనలను మార్చింది. కమిషనర్లు పదవి నుంచి దిగిపోయినప్పటికీ, వారికి ఈ రక్షణ ఉండేట్లు నిబంధనలు మార్చింది. ఆ తర్వాత చెప్పినట్లు చేసే వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నది. ఈ ప్రత్యేక అధికారాలతోనే జ్ఞానేశ్‌కుమార్ వంటి అధికారులు ‘సర్’ పేరుతో ఎన్నికల్లో ఎవరు ఓటు వేయాలనేది నిర్ణయిస్తున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఓట్లలో పొంతన కుదరడంలేదు!
ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించినట్టు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఇటీవల ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. 2024లో మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లలోని 51 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా 32 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం భారీగా ఉన్నట్లు తెలిసింది. వీటిలో 12 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే ఈవీంఎలలో లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయి.
మిగిలిన 20 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని ఆ కథనం వెల్లడించింది. మిగతా నియోజకవర్గాల్లోనూ పోలైన ఓట్ల సంఖ్యను తప్పుగా చూయించినట్టు సదరు నివేదిక అభిప్రాయపడింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలపై పెద్దయెత్తున విమర్శలు వచ్చినట్టు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఓ కథనంలో వెల్లడించింది. మైదుకూరులో జరిగిన పోలింగ్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీప్యాట్ల మధ్య పోలైన ఓట్ల మధ్య వ్యత్యాసం కనిపించినట్టు వివరించింది.
బ్యాలెట్‌తో సమస్యేముంది?
దేశంలో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి బ్యాలెట్ పద్దతిలోనే ఎలక్షన్లు జరిగేవి. ఇప్పుడు కూడా బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ కష్టమేమీకాదు. ఇంకా లోతుగా చెప్పాలంటే, కౌంటింగ్ అనేది కొంచెం ఆలస్యం అవుతుందనేది తప్ప బ్యాలెట్ విధానంతో మరే ఇతర సమస్యలు లేవు. అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే అమెరికా మొదలు కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ తదితర దేశాల అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నారు. అభివృద్ధి చెందిన అమెరికాలో ఓట్ల కౌంటింగ్ పూర్తికావడానికి కనిష్ఠంగా 10 రోజుల నుంచి 30 రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇండోనేషియాలోనూ ఓట్ల లెక్కింపుకు నెలరోజుల సమయం పడుతుంది. అలాగే, ఓట్ల లెక్కింపు కోసం బొలీవియాలో (20 రోజులు), ఫిలిప్పీన్స్‌లో (16 రోజులు), నార్వేలో 14 రోజుల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈవీఎంలతో వచ్చే పారదర్శకలోపాన్ని తగ్గించడానికే, సమయం ఎక్కువైనప్పటికీ ఆయా దేశాలూ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఇక, భారత్ విషయానికి వస్తే, ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం కోటి మందికి పైగా పర్యవేక్షక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 1,350 కేంద్ర బలగాల కంపెనీలు సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాయి. దాదాపు నూరు కోట్ల మంది ఓట్లను లెక్కించడానికి కోటి మంది పర్యవేక్షక సిబ్బంది సరిపోతారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించినప్పటికీ, కౌంటింగ్ రోజుతో కలుపుకొని రెండు, మూడు రోజుల్లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు సీట్లోనూ అనుమానాలు!
- ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలపై కొత్త వివాదం
- చిత్తూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 తర్వాత నమోదైన ఓట్లలో వ్యత్యాసం
- లోక్‌సభ, అసెంబ్లీ లెక్కల్లో ఏకంగా 31 వేల ఓట్ల తేడా
- కుప్పం కూడా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోనే
- ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం
కుప్పం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో సాధించిన విజయంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో రాత్రి 6 గంటల తర్వాత పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం నమోదు చేసిన వివరాల్లో 31 వేలకు పైగా ఓట్ల వ్యత్యాసం ఉన్నట్లు ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో వెల్లడైంది. ఈ అసమానతపై ఎన్నికల సంఘం విచారణ జరపలేదనే ఆరోపణలున్నాయి.
ఎన్నికల సంఘం నివేదికల పరిశీలన
ఎన్నికల సంఘం వద్ద ఉన్న రిటర్నింగ్ అధికారుల అంతర్గత నివేదికలను ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశీలించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత రిటర్నింగ్ అధికారులు ఈ నివేదికలను ఈసీకి పంపిస్తారు. తొలిసారిగా ఈ నివేదికలను బయటి సంస్థ పరిశీలించినట్లు వెల్లడించింది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి
2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు రెండు ఓట్లు వేయగా, పోలింగ్ నిర్వహణ బాధ్యత ఒకే ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరూ క్యూలో చేరకుండా ప్రిసైడింగ్ అధికారి ఓటర్లకు ప్రత్యేక స్లిప్పులు అందిస్తారు.
లోక్‌సభకు 56 వేలు.. అసెంబ్లీకి 24 వేలే!
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయం త్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్న 56,067 మందికి స్లిప్పులు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. అయితే అదే పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి కేవలం 24,596 మందే క్యూలో ఉన్నట్లు నమోదైంది. దీంతో రెండు లెక్కల మధ్య 31,471 ఓట్ల వ్యత్యాసం కనిపించింది. ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఉంది. ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు విజయం సాధించారు.
విచారణ జరుగలేదంటూ ఆరోపణలు
ఒకే పోలింగ్ కేంద్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్యలో ఇంత భారీ వ్యత్యాసం ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లెక్కలు సరిపోని చోట్ల సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై ఎన్నికల సంఘం పూర్తి భరోసా ఇవ్వలేదని పరిశోధనలో వెల్లడైంది. ఈ వ్యత్యాసంపై ఈసీ విచారణ చేపట్టలేదని తెలిపింది.
అర్ధరాత్రి వరకు పోలింగ్.. ప్రతిపక్షాల ఆరోపణలు
హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ అధికారిక ముగింపు సమయం దాటిన తర్వాత కూడా కొనసాగిందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి స్వయంగా తెలిపారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడంపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు వ్యవస్థీకృతంగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఓట్లలో పొంతన కుదరట్లే!
ఈవీఎంల ద్వారా జరుగుతున్న అనర్థాన్ని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఇటీవల ఓ పరిశోధనాత్మక కథనంలో బట్టబయలు చేసింది. దాని నివేదిక ప్రకారం.. ఈవీఎంలు ఏ మాత్రం ఫూల్ప్రూఫ్ కావని స్పష్టమైంది. 2024లో మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 51 స్థానాల్లో లోపాలు కనిపించాయని అది పేర్కొన్నది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిపింది.
ఏ దేశమూ వాడని ఈవీఎం
- ఇప్పటివరకూ ఈవీఎంలను వాడితీసేసిన దేశాలు-30 (అమెరికా, సింగపూర్, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలు)
- తీసివేయడానికి కారణాలు-హ్యాకింగ్, ట్యాంపరింగ్, విశ్వసనీయత సమస్యలు
- పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతున్న ఏకైక దేశం: భారత్
- భారత్ తయారు చేసిన ఈవీఎంలు అధికార పార్టీకి ఓటేసేలా ఉన్నాయని తిరస్కరించిన దేశం: బోట్స్వానా
ట్యాంపరింగ్ ఘటనలు ఇలా..
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఈవీఎంలను కాదని బ్యాలెట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ప్రొఫెసర్, ఎథికల్ హ్యాకింగ్ నిపుణులు సబ్యసాచి చెప్తున్నారు. ఈవీఎంలలో ఉండే చిప్‌లను మార్చడం పెద్ద కష్టమేమీ కాదని, ఈవీఎంలను తయారు చేయడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాలకు చేర్చడం, ఫలితాల ముందువరకూ ఏ క్షణమైనా, ఎలాగైనా ట్యాంపరింగ్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈవీఎం చిప్‌లో ఉండే సోర్స్ కోడ్‌ను మార్చడం ద్వారా ఫలితాలను ప్రభావితం చేయవచ్చని ఆయన తెలిపారు.
అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్స్‌కు చెందిన మరో టెకీ రోప్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన ఎథికల్ హ్యాకింగ్ నిపుణులు హరిప్రసాద్ 2009లో ఓ ఈవీఎంపై ప్రయోగాలు చేశారు. ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వీడియోను తీసి వెబ్సైట్లో పెట్టారు. అప్పట్లో అది వైరలైంది. ట్యాంపరింగ్ ఎలా చేయగలిగారని తెలుసుకొని, దానికి పరిష్కార మార్గాలను కనిపెట్టాల్సిన అధికారులు.. ఈవీఎం ఎక్కడిదంటూ ప్రసాద్‌ను అరెస్ట్ చేసి ఆతర్వాత విడిచిపెట్టారు.
మళ్లీ బ్యాలెట్ పద్ధతి తీసుకురావాలి!
ఈవీఎంలలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే వరకూ వాటిని వాడకూడదు. అంతవరకూ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగాలి..
– బీజేపీ నేత ఎల్కే అద్వానీ (05.07.2009)
80 సీట్లు వచ్చినా.. ఈవీఎంలను నమ్మేదిలేదు!
యూపీ లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ మొత్తం 80 సీట్లను గెలుచుకొన్నప్పటికీ, మేము ఈవీఎంలను నమ్మబోం.
– ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ (02.07.2024)
ఈవీఎంలపై అనుమానాలెన్నో..
సాంకేతికతకు నేను ఎప్పుడూ మద్దతిస్తా. అయితే, ఈవీఎంల పనితీరుపై చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని హ్యాకింగ్ కూడా చేయొచ్చు..
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (23.04.2019)
ఈవీఎంలు ఓ బ్లాక్‌బాక్స్
భారత్‌లో ఈవీఎంలనేవి బ్లాక్బాక్సులుగా తయారయ్యాయి. వాటి లోపల ఏంజరుగుతుందో ఎవరికీ ఏమీ తెలియదు.
– కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (16.06.2024)
ఈవీఎంలను ప్రోగ్రామింగ్ చేయొచ్చు!
లక్షిత పార్టీకి మేలు చేసేలా ఈవీఎంలను ప్రోగ్రామింగ్ చేయొచ్చు. మళ్లీ బ్యాలెట్ ఓటింగ్‌ను తీసుకురావాలి.
– టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (06.07.2009)
బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్
ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పోల్ అవుతున్నది. ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేస్తున్నది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి.
– బీఎస్పీ అధినేత్రి మాయావతి (11.03.2017)
సమస్యలకు నిలయంగా ఈవీఎంలు
ఈవీఎంలలో తరుచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నా యి. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి.
– ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (23.04.2017)
బ్యాలెట్‌తో వచ్చే సమస్యేంటీ?
నేను టెక్నికల్ అంశాలజోలికి పోవట్లేదు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ మళ్లీ తీసుకొస్తే సమస్యేంటీ? ఈవీఎంలతో ఓటర్లకు తాము వేస్తున్న ఓటుపైనే కాదు, ఈసీ విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ (10.11.2026)
బ్యాలెట్ ఓటింగ్ ఇలా
దేశం :ఓట్ల లెక్కింపు సమయం (గరిష్ఠంగా)
అమెరికా :30 రోజులు
ఇండోనేషియా :30 రోజులు
బొలీవియా :20 రోజులు
ఫిలిప్పీన్స్ :16 రోజులు
నార్వే :14 రోజులు


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

