Aishwarya Lakshmi | సినీ పరిశ్రమలో ఒక్క విజయం నటీనటుల కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేస్తుంది. అదే సమయంలో ఓ పరాజయం మాత్రం కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన ఈ రోజుల్లో సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోతే నటీనటులపై జరిగే ట్రోలింగ్ మరింత తీవ్రంగా ఉంటోంది. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తన కెరీర్లో ఎదుర్కొన్న అలాంటి చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కింగ్ ఆఫ్ కోథా’ భారీ అంచనాలతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ఫలితంతో పాటు చిత్రబృందం, నటీనటులపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ జరిగాయి.
ఈ సినిమా పరాజయం తన కెరీర్‌పై మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపిందని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. ముఖ్యంగా సినిమాలో తన నటన, సంభాషణలు పలికిన విధానంపై వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల విమర్శలు నిజమేనేమోనని తానూ అనుకున్నానని ఆమె వెల్లడించారు. సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్రను ఉద్దేశించి తాను పలికిన ‘రాజువెట్టా’ అనే సంభాషణ నెట్టింట విపరీతంగా ట్రోల్ అయిందని గుర్తుచేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో మొదలైన ఆ నెగెటివిటీ షూటింగ్ లొకేషన్ల వరకు చేరిందని ఐశ్వర్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘హలో మమ్మీ’ సినిమా షూటింగ్ సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనను ఉద్దేశపూర్వకంగా ‘రాజువెట్టా’ అంటూ పిలిచి గేలి చేశారని తెలిపారు.
సినిమాలోని ఓ డైలాగ్ కారణంగా మొదలైన ట్రోలింగ్ ఇలా వ్యక్తిగత స్థాయిలోనూ ఎదురవడంతో తాను తీవ్రంగా కలత చెందినట్లు ఆమె చెప్పారు. ఈ పరిణామాల ప్రభావం మలయాళ చిత్ర పరిశ్రమలో తనకు వచ్చే అవకాశాలపైనా పడిందని, కొంతకాలం దర్శకనిర్మాతలు తనకు కొత్త అవకాశాలు ఇచ్చేందుకు వెనుకాడేవారని పేర్కొన్నారు. ఈ చేదు అనుభవం తనలో ఎంతటి భయాన్ని కలిగించిందో చెబుతూ ఐశ్వర్య లక్ష్మి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘కింగ్ ఆఫ్ కోథా’ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం తనకు వచ్చిందట.అయితే ఆ ఆఫర్‌ను ఆమె స్వయంగా తిరస్కరించినట్లు తెలిపారు. దుల్కర్‌తో కలిసి నటిస్తే మళ్లీ అదే తరహాలో ట్రోలింగ్ మొదలవుతుందని, అది ఆ ప్రాజెక్ట్‌పైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించినట్లు చెప్పారు. అందుకే సదరు ప్రాజెక్ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇంతటి చేదు అనుభవం తర్వాత దుల్కర్ సల్మాన్‌తో మళ్లీ కలిసి పనిచేయగలనా అనే సందేహం కూడా తనలో కలిగిందని ఐశ్వర్య లక్ష్మి చెప్పినట్లు తెలుస్తోంది.