The Paradise | నాని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరో రెండు వారాల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు టికెట్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ‘ది ప్యారడైజ్’కు ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడి ప్రీమియర్ షోలకు సంబంధించిన ముందస్తు టికెట్ విక్రయాలు 1 లక్ష డాలర్ల మార్క్‌ను దాటాయి. తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగి 1.40 లక్షల డాలర్లకు పైగా చేరినట్లు సమాచారం.
ఇప్పటివరకు ఉత్తర అమెరికాలోనే 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ఈ స్థాయిలో టికెట్ విక్రయాలు జరగడం విశేషంగా మారింది. రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఊపందుకుంటే బుకింగ్స్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’పై ఇంతటి ఆసక్తికి ప్రధాన కారణాల్లో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. దీంతో అదే కాంబినేషన్లో వస్తున్న తదుపరి సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ‘దసరా’కు పూర్తి భిన్నమైన కథ, నేపథ్యంతో శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాని కూడా తన కెరీర్లో ఇంతకుముందు కనిపించని విధంగా కొత్త లుక్, కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు సినిమాలో పలువురు ప్రముఖ నటులు భాగమయ్యారు. కథ, పాత్రలు, నేపథ్యాన్ని బట్టి శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నాని పాత్రను కూడా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం వస్తోంది. సినిమా విడుదలకు రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచింది. మరోవైపు ఓవర్సీస్లో బలమైన బుకింగ్స్ రావడంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో స్పందన తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.