Youtuber Nandana : తెలుగులో ప్రముఖ యూట్యూబర్ అన్నె రమా నందన(Anne Rama Nandana)ను పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ వీసాతో పాటు ఉద్యోగాల ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన కేసులో ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నందన దంపతులపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎయిర్‌పోర్టులో దిగగానే పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.
లండన్ ఉంటూ ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులరైన నందన పలువురికి ఉద్యోగాల ఆశ చూపి లక్షలు కాజేశారని ఆరోపణలున్నాయి. తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపి నందన మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతో, ఆమెపై లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. సోమవారం ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే అరెస్ట్ చేసి.. ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తరలించారు.
యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన అరెస్ట్ విజువల్స్..#Nandusworld #Youtuber #RTV pic.twitter.com/HyRwkwc7mQ
— RTV (@RTVnewsnetwork) September 7, 2026
నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా రమా నందన పాపులరైంది. లండన్‌లో నివాసం ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో లభించిన గుర్తింపుతో డబ్బులు సంపాదించాలనుకుంది. అందుకని..యూకే వీసా రెన్యువల్ చేపిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, మంచి జీతం ఇప్పిస్తాం అని ఆశ చూపించింది. దాంతో, ఆమెను నమ్మి చాలామంది డబ్బులు పంపారు. అయితే.. చివరకు మీ ధ్రువపత్రాలు సరిపోలేదు. వెరిఫికేషన్ పూర్తి కాలేదు అని ఉద్యోగార్థులతో చెప్పేది నందన. ఆమె భర్త జాగర్తమూడి మధుకర్ డెస్టినీ అనే కన్సల్టెన్సీలో పనిచేస్తున్నాడు. ఇంతకూ వీరిపై కేసు వేసింది ఎవరంటే..? ఇబ్రహీంపట్నం నివాసి మామిల్లపల్ని శివక్రాంతి కుమార్.
లండన్‌లో ఉంటున్న శివక్రాంతి కుమార్ తన వీసా రెన్యూవల్ కోసం నందని భర్త మధుకర్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. తమ సాయం కోరిన అతడితో మధుకర్ తనకు బ్రిటన్‌లో తెలిసినవాళ్లు చాలామంది ఉన్నారని, కచ్చితంగా వీసా రెన్యువల్ చేస్తానని మాటిచ్చాడు. అంతేకాదు అతడి భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్(సీఓఎస్) ద్వారా ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికాడు మధుకర్. దాంతో.. నందన దంపతులకు సోషల్ మీడియాలో ఉన్న గుర్తింపు చూసి శివక్రాంతి కుమార్ వారిని నమ్మాడు. భారత్‌లో ఉన్న తమ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు పంపాలని మధుకర్ కోరగా.. 2023లో శివక్రాంతి దశలవారీగా రూ.15 లక్షలు పంపించాడు. అయితే.. సీఓఎస్ అనేది వీసా కాదు. విదేశీ ఉద్యోగులు వీసా దరఖాస్తుకు ఉపయోగపడేలా అక్కడి లైసెన్స్డ్ ఉద్యోగులకు యూకే ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ ఇది. దీంతో వర్క్ వీసా వస్తుందన్న గ్యారంటీ లేదు. తాను మోసపోయినట్టు గ్రహించిన శివక్రాంతి కుమార్ మధుకర్‌ను నిలదీశాడు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. నందన, మధుకర్ రూ.2 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చేశారు. దాంతో.. శివక్రాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు. నందన దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు.
అయితే.. యూట్యూబర్ నందన మాత్రం తాము ఎవరినీ చీటింగ్ చేయలేదని అంటోది. తానుగానీ, తన భర్తగానీ ఎటువంటి మోసాలకు పాల్పడలేదని.. తన భర్తకు ఎలాంటి కన్సల్టెన్సీ లేదని వీడియో విడుదల చేసింది. కొందరు దురుద్దేశంతోనే తమ కుటుంబానికి వ్యతిరేకంగా ఇదంతా చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తమ పేరుతో మరెవరైనా చీటింగ్‌కు పాల్పడి ఉండవచ్చని నందన తెలిపారు. దాంతో.. ఇంతకూ నందన, మధుకర్‌కు జాబ్ మోసాలతో సంబంధముందా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరిని నమ్మి మోసపోయిన బాధితులు ఎంతమంది? అనేది పోలీసు విచారణలో బయటపడనున్నాయి.
Explained: How Nandana couple allegedly used UK job dreams to collect lakhs
Watch the arrest videos
Popular YouTuber Anne Rama Nandana’s detention at Hyderabad’s Rajiv Gandhi International Airport has brought an alleged UK visa and employment fraud under renewed focus. Police… pic.twitter.com/maogiHHjl7
— Sudhakar Udumula (@sudhakarudumula) September 7, 2026