Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) ప్రతినిధుల సభ, సెనేట్ (Senate) పై పట్టు నిలబెట్టుకుంటే.. ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ‘ట్రంప్ డివిడెండ్ (Trump Devidend)’ గా పిలుస్తామని చెప్పారు.
డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా తనను బ్యాలెట్‌పై ఉన్నట్టుగా భావించి పార్టీకి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. ‘రిపబ్లికన్లు గెలిస్తే.. మీరూ గెలిచినట్లే. మీకు 5,000 డాలర్లు వస్తాయి’ అని చెప్పారు. ఈ పథకానికి కనీసం 1 ట్రిలియన్ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుంచి సమకూరుస్తారన్నది ట్రంప్ స్పష్టం చేయలేదు. ‘మన దేశం చాలా డబ్బు సంపాదిస్తోంది’ అని చెప్పారు.
ఆర్థికంగా, రాజకీయంగా ఈ ప్రతిపాదన అమలు చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి సర్వేల్లో ట్రంప్ ప్రజాదరణ 30 శాతం స్థాయిలోనే ఉంది. ధరల పెరుగుదల, ఇరాన్‌పై అమెరికా చేపట్టిన యుద్ధంపై ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోంది. డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో 230-205 సీట్లతో, సెనేట్‌లో 51-49 ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉందని ‘డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ’ అంచనా వేసింది.
ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని పరోక్షంగా అంగీకరించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసేందుకు రెండు, మూడు వారాల దూరంలో ఉందని, అందుకే యుద్ధానికి దిగాల్సి వచ్చిందని చెప్పారు. యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధికి తన పేరు పెట్టాలని సూచించారు. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని చెప్పారు.