Venkatesh | విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్కు యాక్షన్, క్రైమ్, కామెడీ, ఎమోషన్‌ను జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్, త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి కలిసి యాంకర్ సుమతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఆదర్శ కుటుంబం’ కథకు సంబంధించిన కీలక అంశాలను త్రివిక్రమ్ వెల్లడించారు. అయితే సినిమా కథను పూర్తిగా బయటపెట్టకుండా, కథలోని ప్రధాన ఆలోచనను మాత్రమే వివరించారు.
సాధారణంగా రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ, పోటీ లేదా గేమ్ జరుగుతున్నప్పుడు అందరి దృష్టి ఆ రెండు వర్గాలపైనే ఉంటుంది. కానీ వారి మధ్యలో చిక్కుకునే సాధారణ వ్యక్తుల పరిస్థితిని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరని త్రివిక్రమ్ చెప్పారు. ఇదే ఆలోచనను సినిమాలో ఆసక్తికరంగా చూపించినట్లు ఆయన వివరించారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ప్రపంచం సాధారణంగా ఆ రెండు దేశాల మధ్య ఉన్న సమస్య గురించే మాట్లాడుతుందని త్రివిక్రమ్ ఉదాహరణగా చెప్పారు. కానీ ఆ యుద్ధం ప్రభావం నేరుగా ఎదుర్కొనే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందనే విషయాన్ని చాలాసార్లు పక్కన పెడతామని అన్నారు.
అయితే అలాంటి పరిస్థితిలో మధ్యలో ఉన్న వ్యక్తులు కూడా తమ గొంతు వినిపిస్తే ఏం జరుగుతుంది? వారి నిర్ణయాలు మొత్తం పరిణామాలను ఎలా మార్చగలవు? అనే అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుందని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ‘ఆదర్శ కుటుంబం’లో కూడా ఇలాంటి ఒక ఆలోచన చుట్టూ కథ సాగుతుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా కథను వివరించే సమయంలో త్రివిక్రమ్ ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ అనే కాన్సెప్ట్‌ను ప్రస్తావించారు. మనం ఏదైనా పని ప్రారంభించే ముందు అన్ని విషయాలను ఆలోచించామని, ప్రతి పరిణామాన్ని ముందే అంచనా వేశామని భావిస్తుంటామని ఆయన చెప్పారు. కానీ మన ఊహకు కూడా అందని ఒక సంఘటన అనుకోని దిశ నుంచి వచ్చి మొత్తం పరిస్థితిని మార్చేస్తే.. అదే ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’ అని వివరించారు.
దీనికి ఉదాహరణగా కరోనా మహమ్మారిని ఆయన ప్రస్తావించారు. 2020లో అద్భుతమైన సినిమా తెరకెక్కి, దానికి అద్భుతమైన థియేటర్ అనుభవం ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా థియేటర్లు మూతపడిపోయి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ప్రభావం చూపే పరిణామాన్ని ఎవరూ ఊహించలేకపోయారని, ఇదే ‘బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్’కు ఉదాహరణగా చెప్పొచ్చని త్రివిక్రమ్ వివరించారు. ‘ఆదర్శ కుటుంబం’లో కూడా చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్న ఇద్దరి మధ్యలోకి వారు ఊహించని ఒక పరిణామం వస్తుందని త్రివిక్రమ్ తెలిపారు. ఆ ఒక్క అనుకోని ప్రభావం వారి కథను పూర్తిగా ఎలా మార్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశంగా ఉండబోతున్నట్లు ఆయన వెల్లడించారు.అంటే సినిమా కేవలం ఒక కుటుంబ కథగానే కాకుండా.. ఊహించని సంఘటనలు మనుషుల జీవితాలను ఎలా మార్చగలవు? ఒక చిన్న పరిణామం ఎలాంటి పెద్ద సమస్యకు దారితీయగలదు? అనే అంశాలను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ కుటుంబం’ను ఒకే జానర్‌కు పరిమితం చేయకుండా క్రైమ్, యాక్షన్, కామెడీ, ఎమోషన్ అంశాలను కలిపి రూపొందించినట్లు త్రివిక్రమ్ చెప్పారు.