David Miller Reel : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు దారుణ ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసిన పరాజయంపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను బెదిరింపులకు గురి చేశారు. ఇంతకూ ఆమెను ఎందుకు టార్గెట్ చేశారో తెలుసా.. అహ్మదాబాద్‌లో టీమిండియా ఓటమిలో కీలకమైన డేవిడ్ మిల్లర్(David Miller)తో రీల్ చేసింది తను. ఇంకేముంది.. కొందరు అమెను ట్రోల్ చేస్తూ.. బెదిరింపులకు దిగారు. అత్యాచారం చేస్తామని, బొండంలా ఉన్నావని.. ఇలా బాడీషేమింగ్‌తో బాధ పెట్టారు. ఇవన్నీ భరించలేక తను ఈ రీల్‌ను తొలగించింది.
అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 21న భారత్, దక్షిణాఫ్రికా తలపడగా.. ఆల్‌రౌండ్ షోతో సఫారీ టీమ్ 76 పరుగుల తేడాతో గెలుపొందింది. సమిష్టి వైఫల్యంతో ఓడిన టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అసలే ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్‌కు ప్రొటీస్ హిట్టర్ డేవిడ్ మిల్లర్‌తో ఇన్ఫ్లూయెన్సర్, ఆర్జే ప్రిన్సీ పారీక్ (RJ Princy Parikh) చేసిన రీల్ కనిపించింది.
మ్యాచ్ అనంతరం మిల్లర్‌తో మైదానంలో చేసిన రీల్‌ను సోషల్ మీడియలో పోస్ట్ చేసిన ప్రిన్సీ.. ‘మిల్లర్ అద్భుతమైన బ్యాటర్ కదా.. మిల్లర్ మనమిద్దరం స్నేహితులం అనుకుంటున్నా’ అని క్యాప్షన్ పెట్టింది. ఆ రీల్ చూసిన కొందరు ఆమెను ట్రోల్ చేశారు. బొద్దుగా ఉన్న ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు మరికొందరు నెటిజన్లు. తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న ట్రోల్స్‌ను తట్టుకోలేక ఫేస్బుక్ నుంచి మిల్లర్ రీల్‌ను తొలగించింది. ఈ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టా వేదికగా ఆమె వెల్లడించింది. గతంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతోనూ ప్రిన్సీ రీల్ చేసి వైరలైంది.
‘డేవిడ్ మిల్లర్‌తో తీసిన రీల్ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించాను. గ్రాఫిక్ ఫొటోలు, అత్యాచార బెదిరింపులను.. బాడీషేమింగ్ కామెంట్లను భరించకలేక ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రస్తుతం నన్ను నేను కోల్పోయినట్టుఅనిపించింది’ అని బాధతో కూడిన మెసేజ్ పెట్టింది ప్రిన్సీ. మిల్లర్‌తో రీల్ చేసిందని ప్రిన్సీని టార్గెట్ చేయడం భావ్యం కాదంటున్నారు పలువురు. ‘ఆటగాళ్లకే కాదు అభిమానులకూ క్రీడా స్ఫూర్తి ఉండాల’ని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఇండియా మ్యాచ్ అనంతరం మిల్లర్‌తో ప్రిన్సీ చేసిన రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా ఉంది. మీరూ చూసేయండి.