Vodafone-Idea | ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన నెట్వర్క్ను 4జీకి అప్గ్రేడ్ చేసేందుకు యూరోపియన్ సంస్థలు నోకియా, ఎరిక్సన్లతో సంప్రదింపులు చేపట్టింది. ఇటీవల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) ద్వారా రూ.18 వేల కోట్ల నిధులు సేకరించిన తర్వాత వొడాఫోన్ ఐడియా దూకుడు కాస్త పెరిగిందని తెలుస్తున్నది. 4జీ మౌలిక వసతుల విస్తరణకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేయాలని వొడాఫోన్ ఐడియా భావిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు జూన్ లేదా జూలైలో ఆర్డర్లు ఇవ్వనున్నది. ఇదే డీల్లో `5జీ` సేవల అంశం కూడా ఉంటుంది. కానీ దీనిపై వొడాఫోన్ ఐడియా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికే ఎఫ్పీఓ ద్వారా రూ.18 వేల కోట్ల నిధులు సేకరించిన వొడాఫోన్ ఐడియా రుణాల ద్వారా రూ.25 వేల కోట్ల నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నది. ఇందులో ప్రిఫరెన్షియల్ షేర్ ఇష్యూ ద్వారా ప్రమోటర్ యూనిట్ నుంచి రూ.2075 కోట్ల నిధుల సేకరణకు వొడాఫోన్ ఐడియా ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా 5జీ సేవల ప్రారంభానికి ముందు 4జీ నెట్వర్క్ పూర్తిగా అప్గ్రేడ్ చేయాలని వొడాఫోన్ ఐడియా తలపోస్తున్నది. వొడాఫోన్ ఐడియా 4జీ నెట్వర్క్లో ప్రధాన వాటా గల చైనా కంపెనీలకు 5జీ సేవల విస్తరణలో అనుమతించడం లేదు. దీంతో యూరోపియన్ కంపెనీలతో దేశవ్యాప్తంగా 5జీ సేవల అప్డేట్ చేపట్టనున్న తొలి టెలికం సంస్థగా వొడాఫోన్ ఐడియా నిలవనున్నది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకూ వొడాఫోన్ ఐడియా రుణాలు రూ.2.10 లక్షల కోట్లు. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. మరోవైపు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలతో పోటీ పడేందుకు తన సేవ, ప్రాథమిక మౌలిక వసతులను విస్తరించాలని భావిస్తోంది. ప్రస్తుతం సేవల్లో జియో, భారతీ ఎయిర్టెల్ కంటే వొడాఫోన్ ఐడియా వెనుకబడి ఉన్నది.