సాధారణంగా మంచి సినిమాలు మనసుకు నచ్చుతాయి. పదేపదే చూడాలనిపిస్తాయి. అదేపనిగా గుర్తొస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం వెంటాడుతాయి. గుండెను పిండేస్తాయి. కానీ, ఎంతగా వెంటాడితే మనసుకు అంత ప్రశాంతతనిస్తాయి. గుండెను పిండేకొద్దీ భావోద్వేగాలు పండిస్తుంటాయి. ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా అచ్చంగా అలాంటిదే! మలయాళ చిత్రం తెలుగులో విడుదలై నెల కావొస్తున్నా… ఇంకా పచ్చిగా పదిమందిలో నానుతున్నది. సర్వైవల్ థ్రిల్లర్స్‌కు కొత్త భాష్యం చెప్పిన ‘మంజుమ్మల్ బాయ్స్’కు టీకా తాత్పర్యం..
‘కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.. ప్రియతమా నీవచట కుశలమా.. నేనిచట కుశలమే…’ ఎవరి ఫోన్ స్టేటస్ చూసినా ఈ పాటే! కానీ, దృశ్యాలు మాత్రం వేరు! తాజా స్టేటస్‌లలో ‘గుణ’ అమాయకత్వం కనిపించలేదు. ఉమాదేవి బేలతనమూ కనిపించలేదు. ఓ భయంకరమైన దృశ్యం.. భావోద్వేగాల భారాన్ని రెట్టింపు చేసేలా చీకటి గుహలు. ఆ సొరికెల్లో అశ్రుధారలు. ప్రతిధ్వనించేలా ఆక్రందనలు! ఎందుకంత ఆవేదన? ఎవరి కోసమా నిరీక్షణ?
Munjummel Boys | ‘మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలాగ స్వచ్ఛమైది..’ గుణ సినిమా పాటలో మాటలు ఇవి. ‘మంజుమ్మల్ బాయ్స్’ చూశాక ప్రేమొక్కటే కాదు స్నేహం కూడా అగ్నిలాగ స్వచ్ఛమైనది అనకుండా ఉండలేం. కేరళలోని కొచ్చిన్ సమీపంలో ఉంటుంది మంజుమ్మల్ గ్రామం. అక్కడి జనాభాలో మగాళ్ల సంఖ్య ఎక్కువ. పురుష పుంగవులంతా ‘మంజుమ్మల్ బాయ్స్’ పేరిట ఓ క్లబ్ పెట్టుకుంటారు. అందులో ఓ యాభై మంది సభ్యులుంటారు. నూనూగు మీసాల వాడూ సభ్యుడే, జుట్టు నెరిసిన వాడూ జట్టుగాడే! కాలక్షేపానికి క్యారమ్స్ ఆడుకుంటారు. కులాసాగా ‘మధు’రోక్తులు విసురుకుంటారు. అందులో కొందరికి ఓ సాహస యాత్రకు పూనుకోవాలనే సంకల్పం కలుగుతుంది. చర్చోపచర్చల తర్వాత అందరూ కలిసి కొడైకెనాల్ విహారానికి హుషారుగా బయల్దేరుతారు.
ఈడూజోడూ కుదరకపోయినా.. మాటామంతీ తేడాగా ఉన్నా.. అందరి మధ్య ఉన్న బలమైన బంధం స్నేహం. జాలీగా సాగుతున్న జర్నీలో ‘గుణ’ సినిమా పాట అందరినీ కట్టిపడేస్తుంది. అది వింటున్నప్పుడు ఆ స్నేహితులే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకులూ పెద్దగా ఎమోషన్ కాకపోవచ్చు. కానీ, ‘గుణ’ను ప్రేమించి పదే పదే చూసిన గుణవంతుల మనసులో ఏదో అలజడి రేగక మానదు. ఎందుకో ైక్లెమాక్స్‌లో చెప్పుకొందాం…
మిత్రులంతా కొడైకెనాల్ చేరుకుంటారు. కొండెంగల్లా చెట్లెక్కి ఫొటోలు దిగుతారు. కోతుల్లా గుట్టల్లో షికార్లు కొడతారు. ఆ సంతోషాన్ని వెంట పెట్టుకొని తిరుగు ప్రయాణం అవ్వొచ్చుగా! ముందురోజు రాత్రంతా వారితోపాటు ట్రావెల్ చేసిన ‘గుణ’ పాట అలా ఊరికే రానిస్తే.. కథలో రాణింపు ఏముంటుంది? ఆ సినిమా షూటింగ్ చేసిన ‘గుణ కేవ్స్’ ఇక్కడే ఉంటాయనీ, అవి చూడకుండా తిరిగి వెళ్తే మన విహారానికి విలువే ఉండదని ఓ స్నేహితుడు పలుకుతాడు. 2006 ప్రాంతంలో పాతికేండ్ల వయసున్న కుర్రాళ్లు కమల్ వీరాభిమానులు కాకుండా ఎలా ఉండగలరు!
చలో గుణ కేవ్స్ అని కట్టకట్టుకొని బయల్దేరుతారు. అందరూ దగ్గర దగ్గరగా ఉండి.. దూరం నుంచి ఆ గుహలు చూసొస్తే పోయేదిగా! ఆ గుహల్లోకి దూరాలని దురాలోచన కలుగుతుంది. ‘ప్రమాదం’ అనిహెచ్చరికలున్నా దూరాలోచన లేకుండా గుహలోకి దారితీస్తారంతా. అప్పుడు వారి ‘ఊహలన్ని పాటలే కనుల తోటలో..’! ఆ ఉత్సాహంలోనే ఓ ఉత్పాతం.
మిత్ర బృందంలో సుభాష్ ప్రమాదవశాత్తు ఓ కన్నంలో పడిపోతాడు. అది ఎంత లోతుందీ తెలియదు. పడిన వాడు ఏమయ్యాడో అంచనాకు అందదు. పైనున్న స్నేహితులు గొంతు చించుకున్నా… సుభాష్ ఉలకడు, పలకడు. స్థానికులు వస్తారు, పోలీసులు వస్తారు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగుతుంది. వచ్చినవారు వచ్చినట్టే చేతులెత్తేస్తారు. ఈ ‘డెత్ కిచెన్’ గుహలో పడిపోయినవాడు బతకడని తేల్చేస్తారు. తనను కాపాడుకోకుండా కదలం అంటారు మిత్రులు. వారి నమ్మకానికి కొమ్ముకాసేలా సుభాష్ మూలుగు! అందరిలో మళ్లీ ఉత్సాహం. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఉద్వేగం. రెస్క్యూ ఆపరేషన్‌లో మరో స్నేహితుడు కుట్టన్ పాల్గొంటాడు. వందల అడుగుల లోతున్న సొరికెలోకి దిగి స్నేహితుణ్ని రక్షిస్తాడు. కథ సుఖాంతం!! 2006లో జరిగిన యథార్థ ఘటన సినిమాగా సంచలన విజయం నమోదు చేసుకుంది.
చివరిగా.. గుణ ైక్లెమాక్స్‌లో హీరో… కథానాయికను ‘ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా..’ అన్న చందాన ఆలింగనం చేసుకొని అదే గుహలో అంతెత్తు నుంచి అగాథంలోకి దూకుతాడు. ‘మంజుమ్మల్ బాయ్స్’ సుఖాంతమే! కానీ, ఈ సినిమాలో పండిన భావోద్వేగాలు ‘గుణ’ను గుర్తు చేసుకునేలా చేశాయి. చల్లంగ మానిపోయిన గుండెలోని గాయాన్ని మళ్లీ తట్టి లేపాయి. అందుకే, ‘ప్రియతమా..’ వాట్సాప్ స్టేటస్‌గా మార్మోగుతున్నది. ఇన్‌స్టా రీల్స్‌లో రోల్ అవుతున్నది.
– గుణ