కొన్ని చేతుల్లో అమృతరేఖ ఉంటుంది. వాళ్లు తిరగమోత పెడితే.. వీధంతా గుప్పుమంటుంది. ఆవకాయ కలిపిందని తెలిస్తే.. బంధువర్గ మంతా ఇంటి ముందు వాలిపోతుంది. ఈ వంటలక్క అంతకుమించి. వంటావార్పులో ఖండాంతరాలు దాటిన కీర్తి ఆమె సొంతం. స్వదేశీ రుచులు పక్కాగా వండేస్తుంది. విదేశీ వంటకాలనూ చక్కగా వార్చేస్తుంది.
తన హస్తవాసితో మాస్టర్ షెఫ్ ఇండియా తొలి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమె వంటలకే కాదు.. తయారు చేసే పద్ధతికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మీ చేతి వంట మాకు రుచి చూపించరూ… అని న్యూయార్క్‌లోని పెద్ద ఫుడ్ ఫెస్టివల్స్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలు ప్రేమగా ఆమెను ఆహ్వానించాయి. బీబీసీలాంటి ప్రఖ్యాత చానెళ్లు ఆమె వంటలను సిరీస్‌గా చిత్రీకరించాయి. పిల్లల కోసం వంట చేసే దగ్గర నుంచి స్టార్ షెఫ్‌గా మారిన మాస్టర్ షెఫ్ పంకజ్ భదౌరియా జీవన ప్రయాణం తొలుత చాలామంది మహిళల్లాగే ప్రారంభమైంది.
Pankaj Bhadouria | ఇంటికీ ఇంటికీ… చేతికీ చేతికీ వంట రుచి భిన్నంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వంట వంశపారంపర్యం. వండే విధానం, అందులోని దినుసులు, ఉప్పు, కారం… ఇలా అన్నీ ఎవరికి వాళ్లు తోచినట్టు వేస్తారు. చేస్తారు. ఆ వైవిధ్యమే ఒకే వంటకు విభిన్నమైన రుచుల్ని తెచ్చి పెడుతుంది. కొందరు వండితే అమృతం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఆత్మారాముడు ఆవురావురుమంటున్నప్పుడే కాదు, తిండి ఇంకేమాత్రమూ వద్దని పొట్ట మొండికేసినప్పుడూ… వీళ్లచేతి రుచులు జిహ్వను వహ్వా అనిపిస్తాయి. అలాంటి అమృత హస్తాలు పంకజ్ అమ్మానాన్నలవి.
అందులోనూ పంకజ్ తండ్రి వంట తింటే ఆయన పాకశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారేమో అనిపించేంత అద్భుతంగా ఉండేదట. పంకజ్ తల్లి కూడా ఆయన నుంచే వంట నేర్చుకుని అమోఘంగా వండేవారట. ఇక, ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ అవడంతో ఉభయ రాష్ర్టాల రుచులూ ఆస్వాదిస్తూ పెరిగిందామె. తమ ఇంట్లో పార్టీల కోసం చుట్టాల ఎదురుచూపులు బాగా గుర్తు అంటుంది పంకజ్.
వంట రుచే కాదు, దాన్ని నోరూరించేలా అలంకరించడమూ వాళ్లకు అలవాటు. అందరూ కడుపునిండా తిన్నాక ఆ చోటు ఒక మెచ్చుకోళ్ల వేదిక! వంట చేస్తే ఇంత గుర్తింపు వస్తుందా… మనల్ని అందరూ ఇంతలా మెచ్చుకుంటారా… అన్న ఆలోచన చిన్న వయసులోనే పంకజ్‌కు వంటింటిని పరిచయం చేసింది.
చిన్ననాటి నుంచే…
అమ్మానాన్నా ఎలా వండుతున్నారని రెండు మూడు తరగతుల్లో ఉన్నప్పటి నుంచే గమనించేది పంకజ్. వాళ్లకు వంటలో సాయం చేసేది. అలా అచ్చం వాళ్లలాగే వండటమూ నేర్చుకుంది. పదకొండేండ్ల వయసుకే ఆమె సొంతంగా వంట చేసి, కుటుంబ సభ్యులకు వడ్డించేది. అయితే దాన్ని కెరీర్‌గా తీసుకోవచ్చన్న ఆలోచన అప్పటికి తనకు లేదంటుందామె. అందుకే చదువు మీద దృష్టి పెట్టింది.
ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. స్కూల్ టీచర్‌గా కెరీర్‌ను ఎంచుకుంది. పెండ్లి, పిల్లలు వరుసగా జరిగిపోయాయి. అత్తారింటికి వెళ్లాక ఇంటికి వచ్చే అతిథులకు చక్కగా తన చేతి వంట రుచిచూపించేది. దానికి చాలామంది అభిమానులయ్యారు. 2010లో మాస్టర్ షెఫ్ ఇండియా కార్యక్రమం భారత్‌లోని పాకయాజులందరికీ పిలుపునిచ్చింది. పంకజ్ చేతివంట మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ల పిల్లలు ‘నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అమ్మా, నీకన్నా బెస్ట్ షెఫ్ ఎవరుంటారు’ అని ప్రోత్సహించారు.
తొలి రౌండ్లో పంకజ్ సొంత ఊరు లక్నోలో ఫేమస్ అయిన గలౌటీ కబాబ్కు బెంగాలీ మాడల్ అయిన ఫ్రెంచ్ చికెన్ రౌలాదేను జోడించి ఒక కొత్త వంటకాన్ని తయారుచేసింది. నిజానికి అక్కడ పోటీకి వచ్చిన సగం మంది ఈ కబాబ్లే తెచ్చినా, కొత్త కలబోత ఆ వంటల మధ్య పంకజ్‌ను భిన్నంగా నిలబెట్టింది. ఇందులో తన భర్త సలహా, సహకారం ఎంతగానో ఉన్నాయని చెబుతుంది పంకజ్.
టీచర్ కొలువు వదిలి…
మాస్టర్ షెఫ్ కార్యక్రమంలో చివరి దాకా వెళ్లాలంటే ముంబయిలోని ఒక హోటల్లో మూడు నెలలు ఉండాలన్నారు కార్యక్రమ నిర్వాహకులు. అప్పటికి పంకజ్ పదహారేండ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నది. దీంతో ఉద్యోగమా, పోటీనా… అన్నది తేల్చుకోవాల్సి వచ్చింది. ధైర్యం చేసి తన మనసున్న పోటీకే ఓటేసింది. ప్రతి రౌండ్లోనూ తనదైన రీతిలోని ఫ్యూజన్ వంటల్ని ఎంచుకుంది. కోటి రూపాయల ప్రైజ్‌తో పాటు మాస్టర్ షెఫ్ టైటిల్ వరించింది.
దేశంలోనే పేరెన్నికగన్న షెఫ్‌లు ఉన్నారు ఆ పోటీలో. కేవలం ఇంటి వాళ్ల కోసం వంట చేసే మహిళ ఇందులో గెలవడం అన్నది నిజంగా నమ్మలేని విషయమే. మాస్టర్ షెఫ్‌లుగా మగవాళ్ల ఆధిపత్యం కొనసాగే చోట ఆడవాళ్లూ అంతే స్థాయిలో వంట చేసి మెప్పించగలరు అని నిరూపించింది పంకజ్. దేశం మొత్తం మీదే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇది ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ‘మీచేతి వంట రుచి చూపించరూ’ అంటూ ఆమెను ఆహ్వానించింది. న్యూయార్క్‌లోని వర్లి ఫుడ్ ఫెస్టివల్ నుంచి కూడా పంకజ్ పిలుపు అందుకుంది. అమెరికా, దుబాయ్, ఇజ్రాయెల్, సింగపూర్… ఇలా వేర్వేరు దేశాలకు తన వంటల్ని పరిచయం చేస్తున్నది.
ఆంత్రప్రెన్యూర్‌గా…
మాస్టర్ షెఫ్ టైటిల్ గెలుచుకున్నాక పెద్ద పెద్ద హోటళ్లు ఆమెతో కలిసి పనిచేసేందుకు ఆహ్వానాలు పంపాయి. కానీ అందుకు ఆమె ఇష్టపడలేదు. వంటను ఉద్యోగంగా చేయడం అనే విషయం రుచించలేదు. వంటలో ఎన్ని ప్రయోగాలు చేస్తే అంత మంచి రుచులు అందించగలం. అందుకే ఈ విషయంలో స్వేచ్ఛగా ఉండదలచుకున్నానని చెబుతారామె.
అందుకే, లక్నోలోనే సొంతంగా కలినరీ అకాడమీని ఏర్పాటుచేసింది పంకజ్. ఔత్సాహిక యువతకు, నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకుని కెరీర్లో ఎదగాలనుకునే షెఫ్లకూ పాఠాలు చెబుతున్నది. అంతేకాదు, తన వంటలు పదిమందికీ చేరాలన్న ఉద్దేశంతో ‘షెఫ్ పంకజ్కా జైకా’, ‘రిక్ స్టెయిన్స్ ఇండియా’, ‘సేల్స్ కా బాజీగర్’, ‘కిఫాయతీ కిచెన్’, ‘త్రీ కోర్స్ విత్ పంకజ్’, ‘డ్రీమ్ కిచెన్’ లాంటి కార్యక్రమాలకు, బీబీసీ, స్టార్‌ప్లస్, జీలాంటి వివిధ చానెళ్ల ద్వారా హోస్ట్‌గా పనిచేసింది. కొత్తకొత్త వంటలు ఎలా చేయవచ్చో చెబుతూ ప్రజలకు చేరువైంది.
‘ద సీక్రెట్స్ ఇన్ ద స్పైస్ మిక్స్’, ‘చికెన్ ఫ్రమ్ మై కిచెన్’, ‘టాప్ హండ్రెడ్ రెసిపీస్ బై షెఫ్ పంకజ్’… లాంటి పేర్లతో, తనదైన రీతిలో వంటల్ని పరిచయం చేస్తూ ఏడు పుస్తకాలనూ రాసింది. నార్ సూప్, ఈస్ట్రర్న్ మసాలాస్, తాజా టీ, శాంసంగ్ స్మార్ట్ ఓవెన్, కెంట్ జ్యూసర్ అండ్ పాస్తా మేకర్లకు సంబంధించిన ప్రకటనలూ చేసింది.
మొత్తానికి ఒకప్పుడు టీచర్ అయిన పంకజ్ ఇప్పుడు సెలెబ్రిటీ షెఫ్. ‘వంటను కెరీర్‌గా ఎంచుకోవాలంటే దాని మీద విపరీతమైన ఇష్టం ఉండాలి. అలాంటి వాళ్లనే షెఫ్ కోర్సుల్లో చేరమని సలహా ఇస్తా. ఎందుకంటే మంట ముందు నిలబడి చెమటలు కక్కడం అన్నది గ్లామరస్ ఉద్యోగం కాదు. ఆ మంటలాగే మండే ప్యాషన్ మనలోపల ఉంటేనే ఈ వృత్తిలో రాణించగలం. ఆ కష్టానికి తగిన గుర్తింపు మాత్రం చివర్లో తప్పకుండా ఉంటుంది. ఇదే ఇందులోని గొప్పదనం’ అని ఔత్సాహిక విద్యార్థులకు చెబుతుంది పంకజ్. అవును మరి… ఎంత ఇష్టముంటే, స్కూల్లో పాఠాలు చెప్పే స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో షెఫ్‌లకు పాకశాస్త్ర పాఠాలు చెప్పే స్థాయికి ఎదగగలరు… చెప్పండి!