Fat Soluble Vitamins | మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో విటమిన్లు కూడా ఒకటి. విటమిన్లు ఎ, బి కాంప్లెక్స్, సి, డి, ఇ, కె ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రోజూ అన్ని రకాల విటమిన్లను మనం శరీరానికి అందేలా చూసుకోవాలి. అయితే విటమిన్లలో రెండు రకాలు ఉంటాయి. కొన్ని నీటిలో కరుగుతాయి. కొన్ని కొవ్వుల్లో కరుగుతాయి. నీటిలో కరిగే విటమిన్లను మన శరీరం నిల్వ ఉంచుకోదు. అధికంగా ఉంటే బయటకు పంపిస్తుంది. కనుక ఇలాంటి విటమిన్లను మనం రోజూ తీసుకోవాలి. అదే కొవ్వులో కరిగే విటమిన్లను అయితే శరీరం నిల్వ ఉంచుకుంటుంది. కనుక ఈ విటమిన్లను రోజూ తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్లు బి, సిలు నీటిలో కరుగుతాయి. కనుక వీటిని రోజూ తీసుకోవాలి. విటమిన్లు ఎ, డి, ఇ, కె లు కొవ్వులో కరుగుతాయి. కనుక వీటిని వారంలో 2 లేదా 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది.
విటమిన్లు ఎ, డి, ఇ, కె లు కొవ్వులో కరుగుతాయి. మనం తినే ఆహారాల్లో ఉండే ఈ విటమిన్లు మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వులో కరుగుతాయి. అప్పుడు మన శరీరంలోని కొవ్వు వినియోగం అవుతుంది. అనంతరం ఆ విటమిన్లను శరీరం శోషించుకుని నిల్వ చేస్తుంది. దీంతో విటమిన్లు ఎ, డి, ఇ, కె లు మనకు లభిస్తాయి. వీటిని శరీరం శోషించుకున్న తరువాత లివర్ లేదా కొవ్వు కణజాలంలో నిల్వ ఉంచుతుంది. అవసరం అయినప్పుడు ఉపయోగించుకుంటుంది. కనుక విటమిన్లు ఎ, డి, ఇ, కె లను వారంలో రెండు సార్లు లభించేలా చూసుకుంటే సరిపోతుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్ల వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. విటమిన్ ఎ కంటిచూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
విటమిన్ డి వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. విటమిన్ ఇ వల్ల పురుషల్లో నపుంసకత్వ సమస్య తగ్గుతుంది. శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ కె వల్ల గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీని వల్ల తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే విటమిన్ కె ఎముకల నిర్మాణానికి, దృఢత్వానికి సహాయం చేస్తుంది. కనుక కొవ్వులో కరిగే ఈ విటమిన్లను మనం వారంలో రెండు సార్లు లభించేలా చూసుకుంటే సరిపోతుంది. ఇక ఈ విటమిన్లు కొవ్వులో కరుగుతాయి కనుక మన శరీరంలో కొవ్వు కూడా ఉండాల్సిందే. కొందరు అసలు కొవ్వు ఉండొద్దని భావిస్తారు. కానీ అది సరికాదు. ఎందుకంటే ఆయా విటమిన్లు కరిగేందుకు, పలు రకాల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు కొవ్వు అవసరం అవుతుంది. కనుక శరీరంలో పరిమిత మోతాదులో కొవ్వు తప్పనిసరిగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
విటమిన్లు ఎ, డి, ఇ, కెలను పొందడం కోసం మనం భిన్న రకాల ఆహారాలను తినాల్సి ఉంటుంది. బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు, చేపలు, పాలు, కోడిగుడ్లు, చికెన్, మటన్, రొయ్యలు, పాలకూర, గుమ్మడికాయలు, యాపిల్స్, క్యారెట్లు, చీజ్, టమాటాలు, వెన్న, నెయ్యి, పుట్ట గొడుగులు, మటన్ లివర్, మొలకలు, సోయా బీన్స్ వంటి ఆహారాలను తరచూ తీసుకుంటుంటే ఆయా విటమిన్లు అన్నింటినీ పొందవచ్చు. అయితే రోజూ ఉదయం శరీరానికి సూర్య రశ్మి తగిలేలా కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉంటే మనకు కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. దీని వల్ల చర్మం కింది పొరల్లో ఉండే కొవ్వులో విటమిన్ డి తయారవుతుంది. ఇలా ఆయా విటమిన్లను తరచూ పొందడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.