Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. 35 ఏండ్లు కష్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు తెచ్చాడని తెలిపారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏలు ఇస్తామని హామీలు ఇచ్చారని… కానీ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డికి మనసు రావడం లేదని అన్నారు.
రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరహార దీక్షకు హరీశ్‌రావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి మనసు రావడం లేదని అన్నారు. పదివేల కోట్ల బకాయిలు ఇవ్వమని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే నన్ను కోసుకొని తిన్నా డబ్బులు లేవని అంటున్నాడని మండిపడ్డారు. 96 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మూసీ అభివృద్ధి కోసం రూ.1.5లక్షలు పెట్టి.. 10 వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధమయ్యాడని అన్నారు.
బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులకు ఇవ్వరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కమీషన్ ఇచ్చే వారికి డబ్బులు ఇస్తారు కానీ కమీషన్ ఇవ్వని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరా అని మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 60 మంది చనిపోయారని, వారి చావుకు రేవంత్ రెడ్డినే కారణమని అన్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి కండ్లు తెరుస్తారని నిలదీశారు. కేసీఆర్ హయాంలో రిటైర్డ్ ఉద్యోగులకు నెల లోపే బెనిఫిట్స్ ఇచ్చామని తెలిపారు. 92 వేల ఉద్యోగులు కేసీఆర్ హయాంలో రిటైర్డ్ అయితే వెంటనే డబ్బులు చెల్లించామని తెలిపారు.
ఉపాధ్యాయులను అవమానించేలా విద్యా కమిషన్ రిపోర్ట్ ఉన్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీటిని తరలించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ రిటైర్డ్ అయిన వారికి ఇచ్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. రైతులకు డబ్బులు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇస్తామని మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేసి మీకు న్యాయం జరిగేలా చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులను రోడ్డుమీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కదా అందులో పదివేల కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల కోసం పెట్టు అని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.