భోపాల్: కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు పెద్ద సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి డ్యామ్ స్థంభాలపై నుంచి దూకుతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (students risk lives crossing dam) ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దీనిపై స్పందించింది. ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొందరు పిల్లలు నిత్యం స్కూల్కు వెళ్లేందుకు పెద్ద సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి బెట్వా నదిపై ఉన్న డ్యామ్ స్థంభాలపై నుంచి ప్రమాదకరంగా దూకుతున్నారు. రోడ్డు మార్గంలో 13 కిలోమీటర్ల దూరాన్ని 1.5 కిలోమీటర్లకు తగ్గించుకోవడానికి బాలబాలికలు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు.
కాగా, ఆగస్ట్ 4న మీడియాలో వచ్చిన ఈ వార్తతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్స్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ సంఘటనను సుమోటోగా పరిగణించింది. 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కు తమ పిల్లలను పంపకుండా ఆపడమా లేక ప్రమాదకరమైన ఈ షార్ట్కట్ మార్గంలో వారిని పంపడమా అనే రెండు మార్గాలే వారి తల్లిదండ్రులకు మిగిలాయని తెలిపింది. పొట్టిగా ఉండటం వల్ల డ్యామ్ స్తంభాలను దాటలేక ఒక విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ అయినట్లుగా తమకు తెలిసినట్లు పేర్కొంది. జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ సురక్షిత మార్గం పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుపట్టింది.
మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ, 6 నుంచి 14 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యకు హామీ ఇస్తుందని ఎన్హెచ్ఆర్సీ గుర్తు చేసింది. అదే సమయంలో ‘సురక్షితమైన పాఠశాల, సురక్షితమైన మౌలిక సదుపాయాల హక్కు కూడా విద్యా హక్కులో భాగమేనని పేర్కొంది. 2009 నాటి అవినాష్ మెహ్రోత్రా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు సురక్షితమైన మార్గం లేకపోవడంపై మధ్యప్రదేశ్ ముఖ్య కార్యదర్శికి నోటీస్ జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది.
#MadhyaPradesh
Schools Girls forced to risk their lives,
A visuals of a Betwa Check Dam in Vidisha district, Kakrua village, where school students taking short distance passing through check dam because road distance is 12km long to reach the school. pic.twitter.com/kQg0iB6I0k— Amit Bhardwaj (@AmmyBhardwaj) August 3, 2026