నల్లగొండ రూరల్, ఆగస్టు 07 : రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ, నేల సారాన్ని కాపాడుకునేలా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఎస్ఆర్టీ ఫార్మర్ చంద్రశేఖర్ బడసావ్లే అన్నారు. ఎస్ఆర్టీ వ్యవసాయ విధానంపై నల్లగొండ మండలంలోని మేలదుప్పలపల్లి గ్రామంలో గల వినోద్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఎస్ ఆర్ టి రైతుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఆర్టీ వ్యవసాయ పద్ధతిలో పంటల ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు భూమి సారవంతంను పెంచుకోవచ్చని తెలిపారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎస్ఆర్టీ వ్యవసాయ విధానంలో పంటల మధ్య దూరం, నేల ఆరోగ్యం, సహజ వనరుల వినియోగం, తక్కువ పెట్టుబడితో సాగు వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. రైతులు ఈ విధానంపై అవగాహన పెంచుకుని, తమ పొలాల్లో ఆచరణలో పెట్టాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడి భారం తగ్గడంతో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తి, నేల సారవంతత పెంపు, రైతులకు మెరుగైన ఆదాయం సాధించే అవకాశం ఉంటుందని చీఫ్గెస్ట్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లోకాయుక్త ఏ.రాజశేఖర్ రెడ్డి, ఎస్ ఆర్ టి ప్రతినిధులు ఎం.వెంకటరావు, కె.వినోద్ రెడ్డి, పుట్ట జనార్దన్ రెడ్డి, మామిడి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, రైతులు మందడి భూపాల్ రెడ్డి, బీరం కరుణాకర్ రెడ్డి,వ్యవసాయ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.