పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్.రవిచంద్ర(84) హైదరాబాద్‌లో మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారాయన. రవిచంద్ర స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి దర్శకత్వ శాఖపై పట్టు సాధించారు రవిచంద్ర. సూపర్‌స్టార్ కృష్ణ ఆయనలోని ప్రతిభను గుర్తించి దర్శకునిగా పరిచయం చేశారు. పద్మాలయ బ్యానర్‌పై జితేంద్ర హీరోగా హిందీలో కృష్ణ నిర్మించిన ‘ఖైదీ’ దర్శకునిగా ఎస్.ఎస్.రవిచంద్ర తొలి సినిమా.
ఆ తర్వాత కృష్ణతోనే రౌడీ నంబర్‌వన్, కిరాయిగూండా, సార్వభౌముడు, దొరగారింట్లో దొంగపెళ్లాం చిత్రాలను తెరకెక్కిచారు. ఇక అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘దేశోద్ధారకుడు’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘అశోకచక్రవర్తి’ సినిమాకీ రవిచంద్రే దర్శకుడు. వెంకటేశ్‌తో అగ్గిరాముడు, విజేత విక్రమ్ చిత్రాలను తెరకెక్కించారాయన. హిందీలో రవిచంద్ర ఆరు సినిమాలకు దర్శకత్వం వహించగా.. వాటిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘మహాగురు’ ఒకటి. ఆయన సోదరుడు, నటుడు సారిక రామచంద్రరావు అందించిన వివరాల ప్రకారం ఎస్.ఎస్.రవిచంద్ర అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి.