బంజారాహిల్స్, సెప్టెంబర్ 24: అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, దీన్ని స్వాగతిస్తున్నానని ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేశానని, తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నదని ఊహించినప్పటికీ ఒకసారి ప్రయత్నిద్దామని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆయన చెప్పారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియో జకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ప్రజల తీర్పు కోరుతానని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే తనకు ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. 2004లో ఆసిఫ్‌నగర్‌లో ఉపఎన్నికలో ఓటమికి అనేక కారణాలున్నాయని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే అభివృద్ధి కోసం నిధులు వస్తాయని, దీంతో తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.