న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ.248.55 కోట్లు ఖర్చుచేయగా కేవలం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రూ.289.99 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వ్యయ వివరాల నివేదికల ప్రకారం అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికలతో కలిసి మొత్తం ఐదు ఎన్నికల కోసం బీజేపీ చేసిన రూ.529.38 కోట్ల వ్యయంలో సగానికి పైగా వాటా బెంగాల్‌కే చెందుతుంది. బెంగాల్లో సాధారణ ప్రచారం కోసం రూ.217.16 కోట్లు, అభ్యర్థుల కోసం రూ.69.83 కోట్లు బీజేపీ ఖర్చు చేసింది. 2011లో అధికారాన్ని కోల్పోవడానికి ముందు దశాబ్దాల పాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎం 197 స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానాన్ని గెలుచుకుంది. అభ్యర్థులపై చేసిన ఖర్చుతో కలిపి మొత్తం రూ.8.23 కోట్లు ఖర్చు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర విభాగం తెలిపింది. బెంగాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వ్యయ వివరాల నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు.
పార్టీలు ప్రకటించిన వ్యయాల ఆధారంగా కేరళలో వైరుధ్యం కనిపిస్తున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)ను పడగొట్టింది. ఇందులో కాంగ్రెస్ 63 సీట్లు, సీపీఎం 26 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది. కేరళలో కాంగ్రెస్ తన ప్రధాన కార్యాలయం, రాష్ట్ర విభాగం ద్వారా రూ.105.34 కోట్లు ఖర్చు చేసింది. ఇది బీజేపీ ఖర్చు చేసిన రూ.82.67 కోట్ల కంటే ఎక్కువ. కేరళలో కీలక శక్తిగా ఉన్న సీపీఎం తన రాష్ట్ర విభాగం ద్వారా రూ.28.60 కోట్లు ఖర్చు చేసింది. బెంగాల్, కేరళలో చేసిన ఖర్చులకు అదనంగా అస్సాంలో రూ.96.27 కోట్లు, తమిళనాడులో రూ.51.56 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.90 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ నివేదించింది.