Karnataka | కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. సీఎం సిద్ధరామయ్య తర్వాత డీకే శివకుమార్ మంగళవారం బెంగళూరులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీకి బయలుదేరే ముందు ఈ సమావేశం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశం తర్వాత ఇద్దరూ ఒకే కారులో విమానాశ్రయానికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తయ్యింది. దాంతో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగాలని ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
రాబోయే రెండున్నరేళ్ల పాటు డీకే శివకుమార్ సీఎం పదవి చేపడుతారా? అన్న చర్చలు సాగుతున్నాయి. సోమవారం ఖర్గేతో సమావేశం అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని అంగీకరించాలి. శివకుమార్ అలాగే చేయాలి’ అని పేర్కొన్నారు. అయితే, శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పునరుద్ధాటించారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు కొద్ది నెలల కిందట అంగీకారం తెలిపింది. కానీ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత మార్పు జరుగుతుందని తెలిపారు. హైకమాండ్ నిర్ణయించిందే చెల్లుబాటు అవుతుందన్నారు.
అయితే, గతవారం డీకే శివకుమార్ మద్దతు ఇస్తున్న కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. సిద్ధరామయ్య బెంగళూరులో ఖర్గేతో గంటకుపైగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటున్నారని.. శివకుమార్‌కు సీఎం పదవిపై నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ ఆమోదం తెలిపితే.. సిద్ధరామయ్య తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. దాంతో శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. శివకుమార్‌కు మద్దతుగా ఇటీవల మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారని, త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు అధిష్టాన్ని కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. శివకుమార్‌ను సీఎంగా నియమించాలనే తమ డిమాండ్‌ను ఎమ్మెల్యేలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.